ఉషశ్రీ, పోలాప్రగడ, పోతుకూచి వంటి మహోన్నత రచయితలకు పుట్టినిల్లు...
నేటికీ ఆ సాహిత్య వాతావరణాన్ని యువ కవులు కొనసాగిస్తూ ఉండడం ముదావహం...
కవి కుశమంగా వెలుగొందుతున్న గొడవర్తి శ్రీనివాస్.
ఆయన రచించిన కడిమి పూలు కవితా సంపుటి ఆవిష్కరణలో ఎమ్మెల్యే బండారు.
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : తెలుగు సాహిత్యంలో ఆలమూరు గ్రామం కీర్తి ప్రతిష్టలు అజరామరంగా వెలుగొందుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. శనివారం ఆలమూరు గ్రామ దేవత రావులమ్మ ఆలయం వద్ద గ్రామానికి చెందిన కవి కుసుమంగా వెలుగొందుతున్న గొడవర్తి శ్రీనివాస్ రచించిన కడిమిపూలు కవితా సంపుటిని ఆయన పలువురు ప్రముఖ కవులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదుల లక్ష్మణ శర్మ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును వేదాశీర్వచనం అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కడిమి పూలు కవితా సంపుటి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఆలమూరు గ్రామం ఎందరో కవులకు, ప్రఖ్యాత రచయితలకు పేరు పొందిందని, ఆ సాహిత్య వాతావరణాన్ని నేటి కవులు సైతం కొనసాగిస్తూ ఉండడం గర్వకారణమన్నారు. కడిమి పూలు అంటే కదంబ పుష్పాలని దేవతలు కదంబ వనాల్లో నడయాడుతారని మన పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు. ఆ పేరుతో కవితా సంపుటి తీసుకురావడం హర్షనీయమన్నారు. కడిమి పూలు కవితా సంపుటి లోని ప్రజా రాజధాని అమరావతి, కాటన్ దొర, మా తల్లి గోదావరి మొదలైన కవితలను ఊటంకిస్తూ గొడవర్తి శ్రీనివాస్ మంచి కవిత్వం అందించారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సాహితీ కార్యక్రమాలు ఆలమూరులో నిర్వహించాలని శ్రీనివాస్ మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనివాస్ కు ఎమ్మెల్యే సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏ.రాజు, తహసీల్దార్ కందుల కుశరాజు, రచయిత, బాల మందిరం కన్వీనర్ కృష్ణ శ్రీ, ప్రముఖ కవులు డా. ర్యాలి శ్రీనివాస్, డా. చల్లా రవికుమార్, గౌరీ మల్లిక్, కూటమి నాయకులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)