కరువు సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజాశక్తి కడప అర్బన్ : ఎలినినో ప్రభావిత కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా కరువు రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కడప ఆర్టిఓ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ .. జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదు గాక పంటల సాగు కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయని చెప్పారు. తక్షణం ప్రభుత్వం కరువు బృందాలను పంపి, కరువు అంచనా వేసి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని త్రాగునీటి ఎద్దడికి చెరువుల నింపదల, ఆరుతడి పంటలకు నీరందించి కరువు రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. తెలుగు గంగ, కేసీ కెనాల్ కు నీటి కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న కాలంలో దశల వారి పోరాటాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డిఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీదేవి, మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్ర రెడ్డి, వెంకటసుబ్బయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు పవన్, చిన్న, సిద్ధయ్య, రహీం, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మహిళా సంఘం నాయకురాలు ఐ. ఎన్.సుబ్బమ్మ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)