- మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- రైతులతో యాజమాన్యం తక్షణమే సమావేశం కావాలి
- దశలవారీగా శాంతియుత ఉద్యమం.. రిలే నిరాహార దీక్షలకు సిద్ధం
ప్రజాశక్తి - రేగిడి : సంకిలి షుగర్ ఫ్యాక్టరీ మనుగడను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉత్తరాంధ్ర చెరకు రైతుల పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావం పేరుతో 2027–28 క్రషింగ్ సీజన్‌లో కర్మాగారాన్ని మూసివేస్తామని యాజమాన్యం ప్రకటించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. రైతుల సమస్యలు, చెరకు సాగు విస్తీర్ణం పెంపు, యాజమాన్యం నుంచి అందాల్సిన రాయితీలపై స్పష్టత ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. ఈమేరకు
సంకిలి గ్రామంలో ఉత్తరాంధ్ర చెరకు రైతులతో రెండోసారి సమావేశం నిర్వహించారు. అనంతరం షుగర్ ఫ్యాక్టరీ జీఎం వెంకట సూర్య తేజ పరిరక్షణ సమితి ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలపై రైతులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో మాదిరిగా రైతులకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ సాగు విస్తీర్ణం పెంపునకు యాజమాన్యం ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో రైతులు పేర్కొన్నారు. యాజమాన్యం స్పష్టమైన హామీతో ముందుకొస్తే చెరకు సాగును పెంచేందుకు రైతులు సహకరిస్తారని తెలిపారు.ఫ్యాక్టరీ భవిష్యత్తుపై యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దశలవారీగా శాంతియుత ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమితి నాయకులు తెలిపారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఐడీ ప్యారీ సంస్థ చైర్మన్‌ను కలవడంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రైతుల సమస్యలను వివరించాలని నిర్ణయించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు తదితర ప్రజాప్రతినిధులను కలసి ఫ్యాక్టరీ మనుగడ కోసం సహకారం కోరనున్నట్లు తెలిపారు.
టన్నుకు రూ.5 వేలు ఇవ్వాలి..
ఇదే అంశంపై షుగర్‌కేన్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.సత్యనారాయణ బొబ్బిలిని పాలకొండలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. చెరకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా టన్నుకు రూ.500 అందించాలని కోరారు.ఈ సమావేశంలో రేగిడి, కొమిరి వెంకటాపురం, ఆమదాలవలస, చిన్నయ్యపేట, సంకిలి, బొడ్డవలస, దేవుదల, మంగళాపురం, ఎరకారాయిపురం, అంపిలి తదితర గ్రామాలకు చెందిన చెరకు రైతులు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు కురిటి పాపినాయుడు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బుడితి అప్పలనాయుడు, కింజరాపు సురేష్, చింత సంగమనాయుడు, కేంబూరు కోటేశ్వరరావు, కొమరాపు బలరాంనాయుడు, కర్రి రమణ, మజ్జి అప్పలనాయుడు, గేదెల సత్యం, పప్పల వెంకట అప్పలనాయుడు, నీలకంఠేశ్వర యాదవ్ తదితరులు ఉన్నారు.







కామెంట్‌లు (0)