- సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి - విజయవాడ : బిసి రిజర్వేషన్స్‌పై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయకుండానే 34 శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించడం రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేస్తున్నదని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికైనా వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలనీ, బిసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆటంకంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేయడానికి పార్లమెంటులో చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వంపై టిడిపి కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన రాజీవ్ ర్పుంన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొంది. ఈ రకంగా హైకోర్టులో చెప్పడం రాష్ట్రంలోనే బిసి ప్రజలను మోసగించడమేనాని తెలిపింది.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలన దశలోనే ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 34% ఎలా కల్పిస్తారని హైకోర్టు ప్రశ్నించడం రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని వెల్లడిస్తున్నదని పేర్కొంది. ఇప్పటికే సిపిఎం నివేదికను బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని కోరినా ఎటువంటి స్పందన లేదని తెలిపింది. స్వయంగా నిన్న హైకోర్టు ధర్మాసనం ఈ నివేదికను ఎందుకు బహిరంగపరచలేదని ప్రశ్నించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడింది. సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంటులో చట్ట సవరణకు ప్రయత్నం చేయకుండా 34% పేరుతో బిసిలను మోసగించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని తెలిపింది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను వెంటనే బహిరంగపరచాలని సిపిఎం డిమాండ్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిసి రిజర్వేషన్ల అమలుకు వీలుగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని సిపిఎం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలా చేయనట్లయితే బిసిలను మోసగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాటకం ఆడుతున్నదని ప్రజలు భావించాల్సి వస్తుందని తెలిపింది.







కామెంట్‌లు (0)