సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: పెరిగిన బిపి, మధుమేహం రోగులు

6 గంటల క్రితం

bp sugar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కొత్తగా 23.81 లక్షల కేసులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో బిపి, మధుమేహం ఉన్న వారి సంఖ్య పెరిగింది. నాన్‌ ‌కమ్యూనికేబుల్‌ ‌డీసిసెస్‌ (ఎన్‌‌సిడి) 4.40 సర్వే ద్వారా ఈ కొత్త కేసులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఈ సర్వే ఫలితాల నివేదికను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్‌హెచ్‌ఎం ఎమ్‌డి కెవిఎన్‌ ‌చక్రధర్‌బాబు, రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల సమర్పించారు. ఎన్‌‌సిడి 4.0 సర్వేను గతేడాది సెప్టెంబరు 17‌న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ ఏడాది నవంబరు 10న ముగిసింది. ఈ సర్వే ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు (బిపి), 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 23.81 లక్షల కేసులు నమోదయ్యాయి. నోటి కేన్సర్‌లో 3,339, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ కేసులు 9,171 వెలుగు చూశాయి. రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బిపి, మధుమేహం, నోటి కేన్సర్ పరీక్షలు, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార పరీక్షలు నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం బిపి ఉన్నవారు 59.63 లక్షలు, మధుమేహంతో ఉన్నవారు 48.95 లక్షల మంది ఉన్నారు. అన్ని కేసులు బిపి, షుగర్ కలిగి ఉన్నవారు 34 లక్షల మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటినవారు 4.3 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 13.93 శాతం మందికి అధిక రక్తపోటు, 11.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. అలాగే 3,339 నోటి కేన్సర్, 5,832 రొమ్ము కేన్సర్, 3,597 గర్భాశయ ముఖద్వార కేన్సర్ కేసులను గుర్తించారు. విశాఖపట్నం (78,017), పశ్చిమగోదావరి (68,802), తిరుపతి (65,504), తూర్పుగోదావరి (64,116), వైఎస్‌ఆర్‌ కడప (63,141) జిల్లాలు బిపి కేసుల్లో ముందున్నాయి.

మధుమేహం కేసుల్లో విశాఖపట్నం (80,692), పశ్చిమగోదావరి (67,935), తిరుపతి (67,827), వైఎస్ఆర్‌ కడప (66,914), ప్రకాశం (61,415) జిల్లాలు ముందున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారిలోనే అధికంగా బిపి, మధుమేహం కేసులు ‌నమోదయ్యాయి. అధిక రక్తపోటు కేసుల్లో 47.60 శాతం, మధుమేహం కేసుల్లో 43.39 శాతం ఆ వయసు వారే ఉన్నారు. 18–19 ఏళ్ల మధ్య ఉన్నవారిలో అధిక రక్తపోటు 11,827 మంది (0.20 శాతం), మధుమేహం 10,360 మంది (0.21 శాతం) ఉన్నారు. 20–29 ఏళ్లు మధ్య ఉన్నవారిలో ​బిపి 81,983 మందికి, (1.37 శాతం), మధుమేహం 75,431 మంది (1.54 శాతం) ఉన్నారు. 30–39 ఏళ్లు మధ్య వయసు వారిలో బిపి 2,89,865 మంది (4.86 శాతం), మధుమేహం 2,86,680 మంది (5.86 శాతం) ఉన్నారు. 40–49 ఏళ్లు మధ్యలో బిపి 9,99,833 మంది (16.77 శాతం), మధుమేహం 9,22,583 మంది (18.84 శాతం)ని గుర్తించారు. 9.96 లక్షల నోటి కేన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారులు పరీక్షించారు. వీరిలో 23,009 మందిని పెద్దాస్పత్రులకు పంపించగా, 3,339 కేసులు కేన్సర్‌గా నిర్ధారణ అయ్యాయి. రొమ్ము కేన్సర్ అనుమానిత కేసుల్లో 15,374 మంది మహిళలను వైద్యాధికారులు పెద్దాస్పత్రులకు పంపగా, అక్కడ 5,832 కేసులు నిర్ధారణ అయ్యాయి. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు సంబంధించి 19,429 కేసులను పరిశీలించగా, 3,597 కేసులు నిర్ధారణ అయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్