శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాల నిర్మూలన

18 గంటల క్రితం

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- గంజాయి రహిత రాష్ట్రంగా యాక్షన్ ప్లాన్ : హోం మంత్రి అనిత

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : ప్రజల భాగస్వామ్యంతో గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు స్పష్టమైన ‘వన్ ఇయర్ యాక్షన్ ప్లాన్’ ఉందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర ఈగల్ కార్యాలయంలో శుక్రవారం ‘మౌనం వీడండి.. ఏపీ ఈగల్ 1972 సమాచారం ఇవ్వండి’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈగల్ అధికారులతో సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే మార్పు వస్తుందని, మాదకద్రవ్యాల బారిన పడిన పిల్లల వివరాలను గోప్యంగా ఉంచుతూ, వారికి తగిన సహాయం అందించేందుకు ఈగల్ ప్రారంభించిన బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. తల్లిదండ్రులు ఎలాంటి భయసంకోచాలు లేకుండా సమాచారం అందిస్తే, గోప్యత పాటిస్తూ పిల్లలకు డీ-అడిక్షన్, పునరావాస సేవలందిస్తామని హామీ ఇచ్చారు. వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో అవకాడో, రాంబుటన్ వంటి ప్రత్యామ్నాయ, అధిక విలువ కలిగిన హార్టికల్చర్ పంటల సాగుపై రైతులను ప్రొత్సహించాలన్నారు. ఇప్పటి వరకూ మూడు వేల అక్రమ గంజాయి కేసులు నమోదు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంతో రాష్ట్ర స్థాయి చర్యలను అనుసంధానిస్తూ, విద్యాసంస్థలు, యువతను భాగస్వాములను చేయనున్నామని చెప్పారు. ఎపి ఈగల్ చీఫ్ ఐజిపి ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ చైతన్యం’ ద్వారా గంజాయి అక్రమ సాగును అరికట్టడమే కాకుండా, 2025–26 సంవత్సరంలో 29,839 ఎకరాల్లో 29,978 మంది రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలను అందించామని వెల్లడించారు. ప్రిస్క్రిప్షన్ మందుల అక్రమ విక్రయాలపై ఆపరేషన్ గరుడ ద్వారా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన 16 మందికి మెడల్స్ ప్రదానం చేశారు. ఈగల్ ఆపరేషన్స్ ఎస్‌‌పి మహేశ్వర రాజు, ఈగల్ అడ్మిన్ ఎస్‌‌పి స్వరూప రాణి, డిఎస్‌పి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్