ఎపిఇపిడిసిఎల్ సిఎండి
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎపిఇపిడిసిఎల్ అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని సంస్థ సిఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. తుపాను సన్నద్ధతపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా 12 జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, అంతరాయాలు ఏర్పడితే యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సంస్థ పరిధిలోని 12 జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ కోసం 703 ప్రత్యేక బృందాలను, 8,161 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, సబ్‌స్టేషన్లలో నీరు చేరడం, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 41 కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రులు, తాగునీటి పథకాలు, టెలికాం టవర్లు, అత్యవసర సేవల కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎమ్‌డి ఆదేశించారు. పునరుద్ధరణ పనుల్లో పాల్గొనే సిబ్బందికి రక్షణ పరికరాలు తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)