- 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్ సహా బంగారు ఆభరణాలు మాయం
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని మహిళలను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ ఉదంతం విశాఖలో కలకలం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, అనారోగ్యంతో బాధపడుతున్నానని, విశాఖలో తనకు ఎవరూ లేరని నమ్మిస్తూ వారి ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం అదను చూసి విలువైన ఆభరణాలతో ఉడాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కయ్యపాలెంలోని శంకరమఠం రోడ్డు ప్రాంతానికి చెందిన మానేపల్లి నీరజకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ మహిళ ఆమె ఇంట్లో ఆశ్రయం పొందారు. కొద్దిరోజులు నమ్మకంగా మెలిగిన ఆమె పది రోజుల క్రితం బీరువాలో ఉన్న సుమారు 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్, మరికొన్ని బంగారు ఆభరణాలను చోరీ చేసి కనిపించకుండా పోయినట్లు విశాఖ 4వ పట్టణ పోలీసులకు బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.









కామెంట్‌లు (0)