• ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన
- ఎస్ఐపిబి సమావేశంలో 11 ప్రాజెక్టులకు ఆమోదం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరేందుకు వారు కూడా ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రూ.9,076.11 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 10,531 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతకుముందు సిఎం మాట్లాడుతూ ఈ దిశలో రైతాంగాన్ని ప్రోత్సాహించాలని అన్నారు. భవిష్యత్‌లో పెరిగే ఇథనాల్ డిమాండ్‌ను అధిగమించేందుకు ప్రయత్నించాలన్నారు. ఇథనాల్ వినియోగాన్ని 40 శాతానికి పెంచడం వల్ల మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. పెట్రోలు, డీజిల్‌లో కలిపేందుకు ఇథనాల్ భారీగా అవసరమౌతుందని చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్‌కు సంబంధించి పాలసీని రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను సిఎం ఆదేశించారు. పర్యాటకరంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్రవ్యాప్తంగా 100 టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఏటికొప్పాక, కొండపల్లి , ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాల్ని కూడా తీర్చిదిద్దాలని అన్నారు. దీనికోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నేచర్, వాటర్, అమ్యూజ్మెంట్ పార్కులను అనుసంధానిం చాలని అన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు. కుప్పంలో కంగుంది కోట, చిత్తూరు జిల్లాలో ఎలిఫెంట్ సఫారీ వంటివి అభివృద్ధి చేస్తూ పర్యాటక రంగం నుంచి జిఎస్‌డిపికి వాటా పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అవసరమైన హోటల్ గదులు పెద్దఎత్తున వస్తున్నాయన్నారు. 2024లో 4,390 హోటల్ రూములు ఉంటే... ఈ రెండేళ్లలో 9,364 హోటల్ రూముల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామ న్నారు. దీంతో రాష్ట్రంలో 13,753 హోటల్ రూములు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
సోలార్ సెల్స్ తయారీలో అగ్రగామి కావాలి
రెన్యువబుల్ ఎనర్జీ విస్తృతం కావడంతో సోలార్ సెల్స్ తయారీ పరిశ్రమలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఇంకా ఏర్పాటు చేయాల్సిన 38 ఎంఎస్ఎంఇ పార్కులను త్వరితగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. రైల్వే టెర్మినల్స్‌కు ఎంఎస్ఎంఇ పార్కులను అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా చూడాలన్నారు. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, దుర్గేష్, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.







కామెంట్‌లు (0)