విజయవాడ : సిపిఎం నేత సిహెచ్.బాబురావుకు కుంటిసాకులతో ఎన్నికల అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ... బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు మాట్లాడుతూ .... రాష్ట్రంలో 45 లక్షల మంది ఓట్లను తొలగించిన అనంతరం, తాజాగా మరో 44 లక్షల మందికి ఎన్నికల సంఘం నోటీసులను జారీ చేసిందన్నారు. దేశంలో 16 కోట్ల మంది ఓట్లను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుట్ర పన్నినట్లు తెలుస్తున్నదన్నారు. ఓటు హక్కును నిలుపుకోవటానికి సామాన్యులు నానా అవస్థలుపడుతున్నారన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా సిహెచ్. బాబురావు అన్ని పత్రాలు సమర్పించారు. 2002 జాబితాతో పోల్చి చూసిన అనంతరం, ముసాయిదా జాబితాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 117వ భాగంలో, 467 సీరియల్ నెంబర్ ఓటరుగా ఎన్నికల అధికారులు పొందుపరిచారు, తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల అధికారులు, AERO...కలిసి బాబురావు తండ్రి బాల నాగేశ్వరరావు పేరు 2002 జాబితాతో పోల్చినప్పుడు వ్యత్యాసం, పొరపాట్లు/ తేడాలు ఉన్నాయని, కావున 18వ తేదీన విచారణకు హాజరై మళ్ళీ తగు పత్రాలు సమర్పించాలని నోటీసు జారీ చేశారు. 18వ తేదీన ఎల్బీఎస్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో సంబంధిత అధికారుల ముందు బాబురావు హాజరయ్యి అన్ని పత్రాలు సమర్పించారు. చిగురుపాటి బాబురావు తండ్రి బాల నాగేశ్వరరావు పేరు ఇంగ్లీషులో 2002 జాబితాలో NAGE" V"ARA RAO గా నమోదయింది, ఇప్పుడు ... NAGES"W"RA RAO గా నమోదు చేశారు. తెలుగులోని పేరుని ఇంగ్లీషులోకి మార్చి నమోదు చేసేది ఎన్నికల అధికారులు మాత్రమే. W స్థానంలో V గా నమోదు చేసింది ఎన్నికల సంఘం వారే. వారి తప్పులకు ఓటర్లను బాధ్యులు చేస్తూ.. నోటీసులు జారీ చేయడం తగదని బాబురావు ఎన్నికల అధికారులను ప్రశ్నించారు, విమర్శించారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ..... కేంద్రంలోని బిజెపి, మోడీ ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ద్వారా SIR పేరుతో కోట్లాదిమంది సామాన్యుల ఓట్లను తొలగించటానికి కుట్ర పన్నిందన్నారు. రోజురోజుకీ ప్రజల మద్దతు కోల్పోతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అక్రమ పద్ధతుల్లో గెలుపొందటానికి అన్ని వ్యవస్థలను మోడీ, బిజెపి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. తక్షణ ఎన్నికల్లో గెలుపే కాకుండా, దీర్ఘకాలంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి, నిరంకుశ పాలన సాగించటానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. SIR వలన దేశంలో 16 కోట్ల మంది ఓటర్లు తమ హక్కుని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి దశలో 45 లక్షల ఓట్లు వివిధ కారణాలతో తొలగించారు, చనిపోయిన వారిని మినహాయించినా, 25 లక్షల మందిని వలస వెళ్లిన వారుగా, గుర్తించి జాబితాలో పేర్లు లేకుండా చేశారని తెలిపారు. 45 లక్షల మందిని మినహాయించి ముసాయిదా ఓటర్ల జాబితాలు రూపొందించారు, ఈ జాబితాలో ఉన్న మరో 44 లక్షల మందికి పేర్లు, వయస్సు తేడాలు, వ్యత్యాసాలు... ఇలా అనేక కుంటి సాకులతో వారికి నోటీసులు జారీ చేయడం అన్యాయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా విజయవాడ మూడు నియోజకవర్గాల్లో 1,37,297 మంది ఓటర్లకు నోటీసులు సిద్ధం చేసి, జారీ చేస్తున్నారని అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు, వయసు, ఇతర తప్పులు, లోపాలకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి, ప్రస్తుత జాబితాలో ఓటర్లు సమర్పించిన పత్రాలు ఆధారంగా తప్పులు సరిదిద్దాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తమ బాధ్యతను విస్మరించి.. ఓటర్లను నేరస్తుల్లాగా భావిస్తూ నోటీసులు జారీ చేయటం, విచారించడం, రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఓటర్ల పై పెట్టటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డుల వివరాల ఆధారంగా.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం కాకుండా, ఓటర్లను కుదించటానికి ప్రభుత్వం కుట్రలు పన్నటం గర్హనీయమన్నారు. సామాన్యులు ఓటు హక్కు కోసం ,పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరిగి, తమ పత్రాలను పదేపదే సమర్పించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. స్వాతంత్ర భారత చరిత్రలో.. ఏనాడు ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంలో.. ఇన్ని ఇబ్బందులు రాలేదు, పెట్టలేదు.. కోట్ల మంది ఓట్లను అక్రమంగా తొలగించలేదు... బిజెపి, మోడీ పాలనలోనే ఎన్నికల సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారు అని నిప్పులు చెరిగారు. ఓటర్లు ....వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత వివరాలు, ఆధారాలు, పత్రాలు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఓటు హక్కుని వారే ఎక్కువ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన... ప్రతిపక్ష వైసిపి.. కేంద్రములో, పార్లమెంటులోనూ బిజెపి కుట్రలకు మద్దతు పలుకుతున్నారు, ఇక్కడ ఓట్లు పోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు, ఈ పార్టీలకు ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి లేదు అని విమర్శించారు. అక్రమంగా ఓట్ల తొలగింపుకు బిజెపి కేంద్రానిది బాధ్యత కాగా... ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టిడిపి, జనసేన నైతిక బాధ్యత వహించాలన్నారు. బిజెపి, కేంద్రాన్ని అన్ని అంశాల్లో బలపరుస్తున్న వైసిపి తప్పించుకోలేదు అని హెచ్చరించారు. సామాన్యులు, ఓటర్లు... కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుట్రలను తిప్పి కొట్టాలని, ఓటు హక్కును నిలుపుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా ఇస్తున్న నోటీసులను ఉపసంహరించాలి, తప్పు, ఒప్పులను ఇంటింటికీ తిరిగి తాజా పత్రాల ఆధారంగా సవరించాలి, అందరికీ ఓటు హక్కును పరిరక్షించాలి, జాబితాలో లేని అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు.









కామెంట్‌లు (0)