శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫీజు రీఎంబర్స్‌‌మెంట్‌ హామీని అమలు చేయాలి

9 గంటల క్రితం

sharmila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపిసిసి చీఫ్‌ షర్మిల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పుకునే రాష్ట్రంలో కనీసం పేద విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడానికి దిక్కులేదని ఎపిసిసి చీఫ్‌ ‌వైఎస్‌ ‌షర్మిల విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారాలు చేస్తూనే, మరోవైపు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థులను ఆత్మహత్యాయత్నాలకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు. గత 3 ఏళ్లుగా రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడమంటే బిడ్డల చదువులపై చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బకాయిలన్నీ క్లియర్ చేస్తామన్న హామీ, నేరుగా కాలేజీల ఖాతాలకే నిధులు జమ చేస్తామన్న వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయని, సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అందక పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక చిత్తూరు వంటి చోట్ల విద్యార్థులు ప్రాణాలు తీసుకోవాలని చూడటం అత్యంత బాధాకరమన్నారు. బకాయిలకు ప్రభుత్వానికి సంబంధం లేదని, కాలేజీల ఒత్తిడి లేదని సాకులు చెప్పడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్