శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బకాయిల వేధింపులు!​

13 నిమిషాల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పేద, మధ్యతరగతి బిడ్డల తలరాతలను మార్చే ఆయుధం చదువు. కానీ, నేడు ఆ చదువే వారి పాలిట మరణశాసనంగా మారుతోంది. చదువుల తల్లి ఒడిలో ఉత్సాహంగా సాగాల్సిన విద్యార్థుల ప్రయాణం.. పాలకుల నిర్లక్ష్యపు ఊబిలో కూరుకుపోతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలులో నెలకొన్న జాప్యం విద్యార్థుల పాలిట శాపమౌతోంది. చిత్తూరులోని ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫీజుల వేధింపులు తాళలేక బీటెక్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, అంతకు ముందు మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం కేవలం ఒక్క కళాశాలకు సంబంధించిన ఘటనలు కావు; ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య పాలన విద్యావ్యవస్థను ఏ విధంగా భ్రష్టు పట్టించిందో చెబుతున్న నగ్నసత్యం. కన్వీనర్‌ కోటా కింద సీటు సాధించి, ప్రభుత్వమే తమ ఫీజులు భరిస్తుందన్న భరోసాతో కళాశాలల్లో అడుగుపెట్టిన పేద విద్యార్థులకు వేధింపులే మిగులుతున్నాయి. ఒక్కరోజు ఫీజు ఆలస్యమైతే వేల రూపాయల జరిమానాలు విధించడం, పరీక్షల హాల్‌టికెట్లు ఆపేయడం, కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. కళాశాల యాజమాన్యాలు తమను పీల్చిపిప్పి చేస్తున్నాయని ఆరోపిస్తూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు ఐదు గంటల పాటు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ నిరసన విద్యార్థుల్లో పేరుకుపోయిన ఆవేదనకు, ఆగ్రహానికి నిదర్శనం.

విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుంటే, వారికి నచ్చజెప్పాల్సిన పోలీసు బలగాలు…రంగంలోకి దిగి, వారిని భయభ్రాంతులకు గురిచేయడం, ప్రశ్నించే గొంతులను నులిమేయడం పాలకుల అణచివేత ధోరణికి అద్దం పడుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థలైన ట్రిపుల్ ఐటీ లలోనూ పాత బకాయిలు కడితేనే పట్టాలిస్తామని, బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించుకోవాలని చూస్తున్న నిరంకుశ విధానాలు విద్యా రంగానికి పెను శాపంగా మారాయి. ప్రభుత్వం నుంచి కళాశాలలకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆ భారం విద్యార్థులపై పడుతోంది. సుమారు రూ.5 వేల కోట్ల వరకు కళాశాలల యాజమాన్యాలకు రీయింబర్స్‌మెంట్‌ ‌మొత్తం చెల్లించాల్సి ఉంది. ‌గత ప్రభుత్వం అధికారం దిగే నాటికి సుమారు రూ.1800 కోట్ల వరకు పెండింగ్‌లో వుండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు చేరుకున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేస్తుంటే, మరోవైపు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల గొంతుపై కత్తి పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. వసతి దీవెన వంటి పథకాల నిధులు కూడా అందకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులు అద్దెలు, భోజన ఖర్చులు భరించలేక చదువులను మధ్యలోనే ఆపేసే దుస్థితి నెలకొంది.

ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాల మధ్య నడుస్తున్న ఈ ‘బకాయిల’ దోబూచులాటలో అమాయక విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, కళాశాలలకు నిధులు జమ కాకపోవడం, రుణాల పేరిట వడ్డీ భారం మోపడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలితో బలవంతంగా "అనారోగ్యం వల్లే" ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వ్యవస్థాగత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమే. విద్యార్థుల ఆవేదనను, ఆందోళనను అవాస్తవాలుగా కొట్టిపారేస్తున్న యాజమాన్యాలు, మరోవైపు పోలీసు బలగాలతో వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తగదు. ఇకనైనా విద్యారంగాన్ని రక్షించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరవాలి. యుద్ధప్రాతిపదికన బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు ఊరట కలిగించాలి. బకాయిల పేరుతో విద్యార్థులను వేధించే, అడ్డగోలు జరిమానాలు వసూలు చేసే ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. చిత్తూరు ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫీజులు కట్టలేదన్న ఒత్తిడితో ప్రాణాలు తీసుకునే దుస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. లేనిపక్షంలో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్