శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Crop: ఆదుకోండి..

21 నిమిషాల క్రితం

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కేంద్ర బృందాల వద్ద ఏలూరు, బాపట్ల జిల్లాల రైతుల గోడు

- పంట నష్టాలపై ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు

ప్రజాశక్తి - ఉంగుటూరు, (ఏలూరు జిల్లా, బాపట్ల జిల్లా) : మురసు తుపాను ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని పంట నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాల ఎదుట రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. నీట మునిగి కుళ్లిన పంటను బృందం సభ్యులకు చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఏలూరు, బాపట్ల జిల్లాల్లో పంట నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు శుక్రవారం పర్యటించాయి. ఈ మేరకు ఏలూరు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి కేంద్ర బృందాలు పర్యటించాయి.

బాపట్ల జిల్లాకు చేరుకున్న కేంద్ర బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మొక్కలను అందించి ఆహ్వానించారు. అనంతరం తుపానుతో నష్టపోయిన పంట పొలాల ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరేట్లో కేంద్ర బృందం పరిశీలించింది. నష్టం అంచనాలను కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ వివరిం‌చి, నివేదికను కేంద్ర బృందం సభ్యులకు కలెక్టర్ అందజేశారు. మురసు తుపానుతో బాపట్ల జిల్లా అపార నష్టానికి గురైందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాకు రూ.320.49 కోట్లు నష్టం వాటిల్లిందని, 10,204.02 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, 10,789 మందికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులకు సంబంధించిన 6,251 ట్రాక్టర్లు దెబ్బతినగా వాటి విలువ మొత్తం రూ.9.89 కోట్లు ఉంటుందని వివరించారు. 347.45 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా వాటి విలువ రూ.45.438 లక్షలుగా అంచనా వేశామన్నారు. వివిధ రంగాలలో జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి వివరించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ ఆర్మోరికర్, కేంద్ర ఆర్థిక, వ్యయ మంత్రిత్వశాఖ సహాయ సంచాలకులు హిమాలయ గార్గ్, విద్యుత్ మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ప్రణయ్ గర్గ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి లవన్న పాల్గొన్నారు.మురసు తుపాను ప్రభావానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో 8,500 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతినడంతో నష్టం అంచనా వేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం పరిశీలించింది. ఏలూరు జిల్లా నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఈ బృందం పర్యటించింది. నిడమర్రులో రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంది. రావులపర్రులో ఫొటో ఎగ్జిబిషన్‌‌ను బృందం పరిశీలించింది. క్షేత్రస్థాయిలో కుళ్లిపోయిన పంట, వరి నారును రైతులు బృందానికి చూపించారు. పెట్టుబడి, ఖర్చులు తదితర అంశాలను రైతులను బృందం అడిగి తెలుసుకుంది. పొలాల్లో వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులకు సూచించారు. నష్టం వివరాలను నివేదిక రూపంలో వెంటనే ప్రభుత్వానికి అందజేస్తామని బృందం తెలిపింది. బృందం వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్‌ ఎంజె.అభిషేక్ గౌడ, ట్రాన్స్‌‌కో, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రహదారులు, భవనాల శాఖల ఎస్‌ఇలు కెఎం.అంబేద్కర్, జెడ్. రమేష్, గుణ కనకారావు, విజయరత్నం, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యాన శాఖ డిడి సాజానాయక్, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్