- వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి
- భారత్కు లాభమే అంటూ కేంద్రం వత్తాసు
న్యూఢిల్లీ : భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అమెరికా తన వైపు నుంచి ఒత్తిడి మరింత పెంచింది. ‘మీ పోటీదారుల కంటే ఎక్కువ లబ్ది చేకూర్చేలా టారీఫ్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తాం’ అంటూ హామీలు గుప్పించి త్వరితగతిన ఒప్పందం కుదుర్చుకునేందుకు వ్యూహాం పన్నింది. అయితే ఇది భారత్కు సానుకూల అంశంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఒప్పందం దిశగా అమెరికా తాజాగా ఇచ్చిన హామీ గొప్ప ముందడుగుగా చెప్పుకుంటోంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ..ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో పోటీదారుల కన్నా తమకు ప్రాధాన్యత వుండేలా చూస్తామంటూ అమెరికా హామీ ఇచ్చిందన్నారు. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత అమెరికా తన అంగీకారానికి మించి అదనపు టారిఫ్లు విధించకుండా నిరోధించేలా చట్టపరమైన నిబంధనలు కూడా ఈ ఒప్పందంలో వుంటాయని సదరు అధికారి తెలిపారు. ఒకవేళ అంగీకారం కుదిరిన దానికన్నా మించి అమెరికా టారిఫ్లు విధించిన పక్షంలో వాణిజ్య రాయితీలను సవరించేందుకు భారత్ తన హక్కును కూడా అట్టిపెట్టుకుంది. వాణిజ్య ఒప్పందంలో తొలి దశను ఖరారు చేసేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాగా నవంబరు మొదటి వారంలో జరిగిన చర్చల్లో కస్టమ్స్, వాణిజ్య వెసులుబాటుకు సంబంధించిన అనేక అంశాలు పరిష్కారమైనట్లు సదరు అధికారి పేర్కొన్నారు. పారిశ్రామిక అధిక ఉత్పత్తి సామర్ధ్యంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) తన రెండవ సెక్షన్ 301 దర్యాప్తు నిర్ధారణలు విడుదల చేసిన తర్వాత మాత్రమే అమెరికా తుది టారిఫ్ నిర్మాణం స్పష్టమవుతుందని భావిస్తున్నారు. ఈ దర్యాప్తులో తమకు అనుకూలమైన వైఖరి వెలువడుతుందని భారత్ భావిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, యురోపియన్ యూనియన్ సహా 14 దేశాల్లో తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశిస్తోంది. కాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి కాబట్టి ఇక ఈ నిర్ధారణలు విడుదలవుతాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పరస్పర సుంకాలను చట్ట విరుద్ధమైనవిగా అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో అనేక వాణిజ్య ఒప్పందాలు తమ చట్టపరమైన మద్దతును కోల్పోయాయి. జూన్లో భారత వస్తువులపై అమెరికా పది వాతం టారిఫ్ విధించింది. త్వరలో జరగబోయే దర్యాప్తు ట్రంప్ ప్రభుత్వ విస్తృత టారిఫ్ విధానాన్ని ప్రభావితం చేయగలదని భావిస్తున్నారు.
డెయిరీ, జిఎం ఉత్పత్తులపై రాజీ లేదు : గోయల్
మరోవైపు అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రైతులు ముఖ్యంగా పాడిరైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా రంగాల ఉత్పత్తుల విషయంలో భారత్ రాజీ పడబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరోమారు పేర్కొన్నారు. కానీ ఒకసారి ఒప్పందమంటూ కుదుర్చుకున్న తర్వాత అమెరికా మార్కెట్ శక్తులకు పగ్గాలు వేసే పరిస్థితి ఉండదన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న ఆందోళన. కానీ మోడీ సర్కార్ మాత్రం అమెరికాతో ఈ వాణిజ్య ఒప్పందానికి తహతహలాడుతోంది. భారతదేశంలోని నిర్దిష్ట దిగుమతి ఆంక్షలను టారిఫ్యేతర అడ్డంకులుగా పేర్కొంటూ డెయిరీ మార్కెట్, జిఎం ఉత్పత్తులకు ప్రవేశం కల్పించాల్సిందిగా అమెరికా ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చింది.







కామెంట్లు (0)