బాలల దినోత్సవం సందర్భంగా...
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హేమంత్ అనేవాడు దీపిక అనే అమ్మాయిని క్లాస్ రూమ్‌లోనే రంపంతో గాయపరిచాడు. లక్ష్మి అనే అమ్మాయి దీనిని ప్రతిఘటించింది. దీనికి ముందు కూడా అమ్మాయిల మీద యాసిడ్ పోసిన ఘటనలు, రోడ్ల మీద గొంతు కోసి చంపేసిన ఉదంతాలు వున్నాయి. కారులో, బస్సుల్లో , ప్రైవేట్ ప్రదేశాల్లో, ఇళ్లల్లోకి జొరబడి అమ్మాయిలపై అత్యాచారం చేసిన సంఘటనలు అనేకం. రాప్తాడు ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. తల్లిదండ్రులకు, పిల్లలకి భరోసా ఇచ్చారు. అధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కొంత మార్పు వస్తుంది. కానీ ఎందుకిలా జరిగింది? తప్పు ఎవరిది? అసలు వాస్తవాలు ఏమిటి? శిక్షించడమే సమస్యకు పరిష్కారమా? భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారాలు ఏమిటి? ఏం జరిగితే మరొక హేమంత్ తయారు కాకుండా వుంటాడు?
మానసిక శాస్త్రవేత్తల మాటల్లో...
సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం అనువంశికత వల్ల ఎవరూ రౌడీలుగా పుట్టరు. పరిసరాలు, కుటుంబ పరిస్థితులు, సమాజం, మీడియా వీటన్నిటి ప్రభావాలతోనే మంచి చెడు భావనలు ఏర్పడతాయి. 20 శాతం అనువంశికత మీద ప్రవర్తన ఆధారపడితే, 80 శాతం పరిసరాల ప్రభావానికి లోనవుతారు. వీరు చెప్పిన ప్రధానమైన అంశాల ప్రకారం చిన్నప్పుడు ప్రేమ దొరకని పిల్లలు పెద్దవారయ్యాక మొండిగా, దురుసుగా మారతారు. తండ్రి కొట్టడం చూస్తూ పెరిగిన పిల్లవాడు కొట్టడం సాధారణం అనుకుంటాడు. ప్రేమ లేకపోవడం, నిర్లక్ష్యం, తిరస్కరణకి గురైన పిల్లవాడు అదే భావనలతో పెరుగుతాడు.
మగాడంటే మగాడే. ఆడపిల్ల ఒప్పుకోవాల్సిందే. వద్దంటే బలవంతం చేయాలనే భావన ఏర్పరచుకుంటాడు. నాది కాకపోతే ఎవరిదీ కాకూడదనే యాజమాన్య భావన అలవడుతుంది. ప్రతి ఒక్కరిలో 'ఇడ్' (నాకు ఇప్పుడే కావాలి, ఎలాగైనా దక్కాలి అనే కోరిక), 'సూపర్ ఇగో' (ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పే అంతరాత్మ), 'ఇగో' (ఏది సరైనదో, ఏది సాధ్యమో ఆలోచించి నిర్ణయం తీసుకునే విచక్షణ) అనే భావనలు ఏర్పడతాయి. చిన్నప్పుడు సరైన క్రమశిక్షణ ఇవ్వకపోతే సూపర్ ఇగో బలంగా తయారవదు. పెద్దయ్యాక నాకు కావాలి, ఎలాగైనా నాకే దక్కాలి అనే ఇడ్ మాత్రమే పనిచేస్తుంది. వద్దు అంటే ఆగాలి అనే ఇగో ఉండదు. ఇవే పిల్లల్లో చెడు ప్రవర్తనకు కారణాలు. పిల్లవాని చుట్టూ నాలుగు వలయాలు ఉంటాయి. కుటుంబం, బడి, ఊరు, ప్రభుత్వం. ఇందులో ఏ ఒక్క వలయం పాడైనా పిల్లవాడు చెడిపోతాడు. స్పష్టంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ గత 50 ఏళ్ల పరిశోధనలు తేల్చిన ఒక స్పష్టమైన విషయం ఏమంటే... చిన్నప్పుడు ఎక్కువగా తన్నులు తిన్న పిల్లవాడు పెద్దయ్యాక దూకుడుగా, నేర ప్రవృత్తిలో ఉండే అవకాశం 40 శాతంగా ఉంటుందని చెప్పింది. పిల్లలు చెడ్డవారుగా మారడానికి కారణమేమిటో లోతుగా పరిశీలించాలి.
కుటుంబంలో జరగాల్సింది....
పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. సందర్భోచితం గా తప్పులను విశ్లేషణ చేసి చెప్పాలి. ఇంట్లో ఘర్షణ లేని ప్రేమపూర్వక వాతావరణం ఏర్పరచాలి. ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి. నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగించాలి. పుస్తకాలు పట్ల ఆసక్తిని కలిగించాలి. ఇంటి శ్రమలో భాగస్వాములను చేయాలి. బయట వ్యవసాయ పనులతో పాటు చిన్న చిన్న వృత్తులు చేసేవారి శ్రమను వారికి చూపాలి. పెద్దల్ని గౌరవించడం చుట్టూ ఉన్న ప్రకృతిని సమాజం పట్ల బాధ్యతగా ఉండటం నేర్పాలి. ఎలాగైనా సంపాదించడం కాదు నిజాయితీగా బతకడం నేర్పాలి. తప్పుని తప్పని చెప్పాలి. పిల్లలతో కుటుంబంలో ఉన్న పెద్దలందరూ స్నేహితుల్లా మసలాలి. వారి కష్టసుఖాల్ని మనతో స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణన్ని సృష్టించాలి. కుటుంబం నాకు భరోసానిస్తుంది. నన్ను గౌరవిస్తుంది అనే భావన ఏర్పడితే మంచి ఉత్తమ పౌరుడుగా తయారవుతాడు.
పాఠశాలల్లో....
వీడు మొద్దు, వీడు తెలివైనవాడు, పనికిరాడు అని ఎప్పుడూ ఎవరినీ అనొద్దు. నీవు ఇప్పుడు ఇలా ఉన్నావు. కానీ నువ్వు భవిష్యత్తులో అలా అవ్వగలవు... అని ప్రోత్సహించండి. దీన్నే మనస్తత్వశాస్త్రంలో ‘గ్రోత్ మైండ్ సెట్’ అంటారు. తప్పు చేసిన పిల్లవాడిని బయట నిలబెట్టకండి. కోపాన్ని మాటల్లో చెప్పడం నేర్పండి. మీరు క్లాస్‌కి, టైంకి వస్తే క్రమశిక్షణ నేర్చుకుంటారు. మీరు అటెండర్‌ని, టీచర్‌ని గౌరవంగా పిలిస్తే సమానత్వం నేర్చుకుంటారు. నాకు తెలియదు రేపు చెప్తాను అంటే నిజాయితీ నేర్చుకుంటారని చెప్పండి. ఇది తప్పనిపిస్తుంది అని చెప్పే ధైర్యాన్ని పిల్లలకు ఇవ్వండి. పిల్లలు రౌడీలు లాగా తయారవడం వారి తప్పు కాదు. వారిని మనం మనిషిగా తీర్చిదిద్దడంలో వైఫల్యం ఉందేమోనని చెక్ చేసుకోవాలి.
కోపాన్ని మాటల్లో చెప్పడం, వద్దు అంటే గౌరవించడం, తిరస్కరణను తట్టుకోవడం, ఓటమికి కృంగిపోకుండా ఉండటం నేర్పితే 90 శాతం నేరాలు తగ్గుతాయి. పాఠం చెప్పడం కాదు, క్లాసులో జీవించాలి. చదువు రాని పిల్లవాడికి ఆటల్లో, చిత్రలేఖనంలో, మొక్కలు పెంచడంలో గుర్తింపునివ్వండి. ఉద్యోగం ఒక్కటే చదువు కాదు. వృత్తి ఏదైనా నిజాయితీగా ఉండాలని నేర్పాలి. సమాజాన్ని క్లాసు రూమ్ లోకి తీసుకురండి. పిల్లలకు పుస్తకాలు, పెద్దవారే గొప్ప అనుభవ పాఠాలని చెప్పండి. సాంకేతికత, సెల్ ఫోను, ఇన్‌స్టాగ్రామ్ వంటివి అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పండి. ప్రవర్తన అనేది వ్యాధి కాదు. పిల్లలు మాటల్లో చెప్పలేని బాధను ప్రవర్తనలో చెప్తారు. ప్రవర్తన ఒక సందేశం. దాన్ని అర్థం చేసుకుని వారిని సన్మార్గంలో పెట్టాలి.
ప్రభుత్వం చేయాల్సింది...
సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందిస్తున్నది. అయితే శాశ్వత పరిష్కారానికి కొన్ని చర్యలు చేపడితే మంచి పరిణామాలు చూడవచ్చు. ప్రతి పాఠశాలలో ఒక కౌన్సిలర్, ఒక ఫిజికల్ టీచర్ తప్పనిసరి చేయాలి. సిలబస్‌లో జీవన నైపుణ్యాలను పెంపొందించే విధంగా కోపాన్ని అదుపు చేయడం, వద్దు అంటే వద్దు అని నేర్పడం, తిరస్కారాన్ని తట్టుకోవడం లాంటి నైతిక అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. మార్కుల చుట్టూ వ్యవస్థ మొత్తాన్ని కేంద్రీకరించటం కాకుండా మార్కులు ఒక భాగం, నైతికత కీలకం అనే అంశం చుట్టూ ఎక్కువ సమయాన్ని పాఠశాలలో కేటాయిం చేలా ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలి.
ప్రతి పాఠశాలలో పరిసరాలలో సి.సి టీవీలు, సందర్శకుల రిజిస్టర్, మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలోని క్లాస్ రూముల్లో, గోడల మీద...వేధింపుల ఫిర్యాదుకు సంబంధించి చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098 రాయించాలి. ప్రతి పాఠశాలలో లైబ్రరీ కచ్చితంగా నిర్వహించాలి. సైన్స్ ల్యాబ్ తప్పనిసరిగా వుండాలి. అందులో పరికరాలు, వసతులు కల్పించాలి. పాఠశాల పరిసరాల్లో చాక్లెట్ల రూపంలో, మరో రూపంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల్ని అమ్మే వారిపై కఠినమైన చట్టాలను రూపొందించాలి. జన జాగృతిని కల్పించే తరం తయారయ్యే తరగతి గదుల రక్షణ కోసం ప్రత్యేక నిధులను, విధులను రూపొందించాలి.
పిల్లలు తప్పు చేసినప్పుడు, యువత నేరం చేసినప్పుడు కుటుంబం, బడి, సమాజం, ప్రభుత్వం ఈ నాలుగు విభాగాలు కలిసి ఐక్యంగా పని చేస్తే పరిష్కారం పెద్ద కష్టం కాదు.
వ్యాసకర్త : ఎన్. వెంకటేశ్వర్లు
యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు







కామెంట్‌లు (0)