- ఎల్లుండి నుంచే నామినేషన్ల స్వీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దశలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా తుది దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మూడో దశ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు 21వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నారు. నామినేషన్ల తిరస్కరణపై అభ్యంతరాలు, అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఈ అప్పీళ్లను 26వ తేదీన పరిష్కరించనున్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
ఇప్పటికే తొలి దశలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి తుది అభ్యర్థుల జాబితా విడుదలైంది. రెండో దశలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. తాజాగా మూడో దశ నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరిగింది.







కామెంట్‌లు (0)