- రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగింపు
- అగన్‌వాడీ కేంద్రాల తనిఖీ
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున్న కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణానదిలో కొద్ది రోజులుగా ప్రవాహం మొదలైనట్లు తెలిపారు. అలాగే గోదావరిలో వరద పరిస్థితిని వివరించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరుచూ తాగునీటి పరీక్షలు జరపాలని, ప్రయోగశాలల పరీక్షా నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. రవాణ శాఖలో పూర్తి స్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను సిఎంకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం-5బి వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు చెప్పారు. దశలవారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)