- మంత్రి లోకేష్ సమక్షంలో ఎంవోయులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు ఆదివారం సంతకాలు చేశారు. విశాఖలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కలిసి తిరుపతి ఐఐటీలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రాన్ని సోలార్ తయారీ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతిపాదిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అధునాతన సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పరిశోధనలు, అధ్యాపకుల సామర్థ్య అభివృద్ధి, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ , శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎపి సమగ్ర శిక్ష సంయుక్తంగా మరో ఒప్పందం కుదిరింది. ఎపి ఉన్నత విద్యామండలి, ఆస్ర్టేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటేడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్ధుల మానసిక ఆరోగ్యం, సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటునందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణా కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని అందించేందుకు నాల్గవ ఎంవోయు జరిగింది. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అందించడం, విద్యా సంస్థలు-పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఏర్పరచడం ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంవోయూలకు ముందు ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, రాష్ట్రంలో గల విస్తృత అవకాశాలను వివరించారు. అనంతరం జూలియన్ హిల్‌ను చంద్రబాబు శాలువాతో సత్కరించి అరకు కాఫీని, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఎండి గణేష్ కుమార్, తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ్, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.ఉమా, చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ, సహాయ కార్యదర్శి డామియన్ ఒలివర్, మంత్రి సలహాదారు జార్జ్ థివియోస్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన వల్లే ఈ ఒప్పందాలు జరిగాయని లోకేష్ కార్యాలయం వెల్లడించింది.








కామెంట్‌లు (0)