మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సంక్ష‍ోభం నుంచి సుస్థిరత వైపు..

3 రోజుల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 12:26 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- 2047 స్వర్ణాంధ్రే లక్ష్యం

- వైసిపి పాలనలో 
రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి

- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సిఎం చంద్రబాబు

​ప్రజాశక్తి -ప్రజాశక్తి అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు, వికాసం నుంచి వైభవం వైపు, సంక్షోభం నుంచి సుస్థిరత వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను సాధించడమే లక్ష్యంగా ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు దృఢ సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజధాని అమరావతిలోని నేలపాడు ప్రాంతంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సిఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు వచ్చే రెండు దశాబ్దాలపాటు నిరంతరం కృషి చేయాల్సిన అవసరముందన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు. దశాబ్దాలపాటు సాగిన పోరాటం, ఎందరో మహనీయుల బలిదానాలు, మరెందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. 80 ఏళ్ల క్రితం దేశ పెద్దలు కన్న కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన వికసిత్‌ భారత్‌ లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యం వేర్వేరు కాదని అన్నారు. దేశానికి ఎపి బలమైన రాష్ట్రంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయని చెప్పారు. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే ప్రజలకు మార్పు కనిపించేలా చేశామని పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు. అన్ని వ్యవస్థలనూ తిరిగి పనిచేసేలా చేయడంతో రాష్ట్ర వృద్ధిరేటు 11.3 శాతానికి చేరిందన్నారు. విద్య, ఉపాధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మెగా డిఎస్‌‌సికి అడ్డంకులున్నప్పటికీ 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఏటా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 28 కొత్త విధానాలను తీసుకొచ్చామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. రూ.95 వేల కోట్ల విలువైన బిపిసిఎల్ వంటి భారీ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కుతోందన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంతో ‘సంజీవని’ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.1,631 కోట్లు ఖర్చు చేసి పేదలను ఆదుకున్నామని వెల్లడించారు. పొగాకు, కోకో, మామిడి రైతులకు మద్దతు ధర కల్పించి అండగా నిలిచామని చెప్పారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్‌ కేలండర్‌ను విడుదల చేశామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కలను నిజం చేసే దిశగా ఫేజ్‌వన్ పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం 73 శాతం పూర్తయిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేస్తున్నామని, అనకాపల్లికి త్వరలో గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 89 శాతం పూర్తయ్యాయని, వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఆధునిక ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో రూ.64 వేల కోట్ల విలువైన రైల్వే పనులు, రూ.38 వేలకోట్ల హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌, పోలవరం, అమరావతి తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. అమరావతిని బ్లూ గ్రీన్‌ సిటీగా, డీప్‌టెక్‌ క్యాపిటల్‌గా, కార్బన్‌ న్యూట్రల్‌, నో పోల్‌ సిటీగా ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో పర్యాటక రంగంలో రూ.19,390 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశామని, అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా మార్చామని చెప్పారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలను రైతులకు జారీ చేస్తున్నామని తెలిపారు. ఉచిత ఇసుక విధానం ద్వారా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశామన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, నాలా చట్టాన్ని రద్దు చేశామని వెల్లడించారు. నకిలీ మద్యం బ్రాండ్లకు చెక్‌ పెట్టామని తెలిపారు. ‘ప్రజలే ఫస్ట్‌’ అనే నినాదంతో పిపిపి విధానానికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి రూ.30,849 కోట్ల బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు ‘ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌’ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎపిఎస్‌పి, సిఆర్‌పిఎఫ్, కర్ణాటక పోలీసు దళాలు, ఎన్‌సిసి, స్కౌట్స్‌ విద్యార్థుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ‌సిఎం చంద్రబాబు పోలీసు మెడల్స్‌ను అలం కరించారు. ఈ కార్యక్రమంలో డిజిపి హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్