సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘నాసా’ దుర్వినియోగం-యోగిపై న్యాయస్థానం ఆగ్రహం

1 గంట క్రితం

up govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

మోడీ, యోగి సర్కార్లు రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను ఎంత నగ్నంగా బేఖాతరు చేస్తున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ ఆకృతి చౌదరిపై మోపిన ‘నాసా’ కేసు. ఆకృతి చౌదరి అనే పాతికేళ్ల యువతిని జాతీయ భద్రతా చట్టం (నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ - ఎన్.ఎస్.ఎ) కింద ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జైల్లో పెట్టడాన్ని అలహాబాదు హైకోర్టు తప్పు పట్టింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడమే కాదు, ఆమెపై తప్పుడు ఆరోపణలతో ఎన్.ఎస్.ఎ కేసు మోపి అరెస్టుకు ఆదేశించిన నోయిడా జిల్లా కలెక్టర్‌ ఆమెకు రూ. ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని సెప్టెంబర్‌ 2వ తేదీన హైకోర్టు అరుదైన తీర్పు చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న ఆకృతి చేసిన పాపమంతా వేతనాలు పెంచాలని, హర్యానాతో సమానంగా జీతాలు చెల్లించాలని ఆందోళన చేస్తున్న నోయిడా కార్మికుల వైపు నిలబడటమే.

ఏప్రిల్‌ 10 నుండి 18వ తేదీల మధ్య నోయిడాలో కార్మికులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ ప్రదర్శనలను ఎగదోస్తున్నారంటూ ఆకృతితో పాటు మరికొందరిపై ప్రభుత్వం కేసులు బనాయించింది. ఆకృతిపై ఏకంగా ఎన్.ఎస్.ఎ కింద కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఆ ప్రదర్శనల సందర్భంగా ఏప్రిల్‌ 13న కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. కార్మికులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌ను అడ్డుకొన్నారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆకృతిని పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లు విసరమని, తగలబెట్టమని ఆమె కార్మికులను రెచ్చగొట్టిందని ఆ పోలీసుల ఆరోపణ. ఐదు నెలలకు పైగా ఆమెను జైల్లో బంధించారు. ఆమెపై తమ దగ్గర ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలు, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు కోర్టు ముందు బొంకారు. కానీ ఏ సాక్ష్యాధారం చూపలేకపోయారు. నిజానికి ఆమె ఏ తేదీన రెచ్చగొట్టే ప్రసంగం చేసిందని పోలీసులు ఆరోపించారో ఆ రోజున ఆమె పోలీసు కస్టడీలో ఉన్నట్లు విచారణలో తేలింది. రాతపూర్వక హెచ్చరిక నోటీసు ఇవ్వడానికే తాము ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లామన్న పోలీసుల వివరణ కూడా నిలువలేదు. పోలీస్‌ జనరల్‌ డైరీని తెప్పించి పరిశీలించిన హైకోర్టు ఆమెను కస్టడీలోకి తీసుకొన్న తర్వాతే పోలీసులు నోటీసును సిద్ధం చేశారని నిర్ధారించుకొంది. దాంతో ఆకృతిపై మోపిన చార్జీలు ఒక కట్టుకథ అంటూ న్యాయస్థానం ప్రభుత్వ వాదనను కొట్టేసింది.

దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టే వారిపై ప్రయోగించాల్సిన ఎన్.ఎస్.ఎ చట్టాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిపై ప్రయోగిస్తున్నారు. అత్యంత కఠిన పరీక్షలను దాటుకొన్న తర్వాత నెలల తరబడి శిక్షణ పొందే ఐఎఎస్‌, ఐపిఎస్‌ వంటి విద్యావంతులు ఇలా ప్రభుత్వం పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ పౌర హక్కులకు తిలోదకాలు వదుల్తున్నారు. ఇలాంటి కేసులు ఉత్తరప్రదేశ్‌లో చాలా ఎక్కువ. ఎన్.ఎస్.ఎ కేసుల్లోనే కాదు ‘ఉపా’ కేసుల్లోనూ దానిదే అగ్రస్థానం. ఇవన్నీ గమనించే కావచ్చు. న్యాయస్థానం ఆకృతికి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని నోయిడా జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ అరుదైన తీర్పు చెప్పింది. బహుశా ఇతర కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు అదో హెచ్చరిక కావాలని న్యాయస్థానం భావించిందేమో?

ఎన్.ఎస్.ఎ చట్టం కింద అరెస్టయిన వ్యక్తి కనీసం మూడు నెలలపాటు జైల్లో ఉండాలి. ఆ గడువును ఎంత కాలమైనా పొడిగించవచ్చు. అది ప్రభుత్వ ఇష్టం. ఈ విషయంలో తాము న్యాయంగానే వ్యవహరిస్తున్నట్లు కన్పించడానికి ఒక సలహా బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ సలహా బోర్డులో ముగ్గురు సభ్యులుంటారు. వారు హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కావడానికి అర్హతగలవారు కావచ్చు. ఆ సలహాబోర్డు ఎన్.ఎస్.ఎ కింద మోపిన ఆరోపణలను సమగ్రంగా విచారించి సదరు వ్యక్తి నిర్బంధంలో ఉండతగిన వాడా? కాదా? నిర్ణయించి తమ అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు తెలియచేస్తుంది. ఎన్.ఎస్.ఎ కేసు వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే ఎన్.ఎస్.ఎ కేసు నమోదు అవుతుంది. సలహా బోర్డు ముందు నిందితుడికి న్యాయవాదిని నియమించుకొనే అవకాశం ఉండదు. వందలాది పేజీల ఆరోపణలకు నిందితుడే సమాధానం చెప్పుకోవాలి. ఆకృతి కేసులో జిల్లా కలెక్టర్‌ చేసిన తప్పుడు ఆరోపణలను సలహా బోర్డు ఎలా ఆమోదించింది అన్నది ఒక ప్రశ్న?

దేశవ్యాపితంగా ఎన్.ఎస్.ఎ కింద నమోదయ్యే కేసుల సంఖ్యను జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) కూడా వెల్లడించడం లేదు. ‘ఉపా’ కింద ఎన్ని అరెస్టులు జరిగాయి? న్యాయస్థానాల్లో ఎంతమంది నిందితులపై ఆరోపణలు రుజువై శిక్షలు పడుతున్నాయి? తదితర వివరాలు ఎన్‌సిఆర్‌బి ద్వారా లభిస్తున్నాయి. ‘ఉపా’ కేసుల్లో నిందితులపై కూడా న్యాయస్థానాల్లో నేర నిర్ధారణ జరిగి శిక్షలు పడిన కేసులు అత్యల్పం. అయితే నేర నిర్ధారణకు ముందే నెలలు, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.

ఎవరినైనా అరెస్టు చేసే, విచారణ పేర వారిని జైల్లో వేసే అవకాశం తమకు ఉందనే భావన పోలీసుల్లో ఇప్పటికీ బలంగా ఉంది. అరెస్టు అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడమే. కానీ పోలీసు వ్యవస్థలో ఆ స్పృహ ఉందా? అన్నది అనుమానమే. ఇలాంటి స్థితిలో ప్రభుత్వాలు కూడా తోడయితే మానవ హక్కుల హననం నిరాటంకంగా జరిగిపోతుంది.

గతంలో యోగి ప్రభుత్వం డాక్టర్ కఫీల్‌ ఖాన్‌ అనే పిల్లల వైద్యుడిపై ఎన్.ఎస్.ఎ కేసును మోపినప్పుడు కూడా పరాభవం పాలైంది. ముందు డాక్టర్‌ ఖాన్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధంగా ఉంచని కారణంగా గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో చాలామంది పసిపిల్లలు చనిపోయారని ఆరోపిస్తూ సస్పెండ్‌ చేసింది. కేసు బనాయించి జైల్లోకి తోసేసింది. శాఖా పరమైన విచారణలో డాక్టర్ ఖాన్‌ ఏ తప్పు చేయలేదని నిర్ధారణ కావడంతో ఆయన్ని విడుదల చేయక తప్పలేదు. కొన్ని రోజుల తర్వాత అలీగఢ్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను రెచ్చగొట్టాడంటూ మళ్లీ జైల్లోకి తోసింది. దానికి ముందు తిండి, నీరు ఇవ్వకుండా కొన్ని రోజుల కడుపు మాడ్చారు. బట్టలు విప్పించి రోజుల తరబడి లాఠీలతో బాదారు. ప్రభుత్వం పెట్టిన ఎన్.ఎస్.ఎ కేసు కూడా న్యాయస్థానంలో నిలబడలేదు. హైకోర్టు ఆదేశంపై ఆయన్ని విడుదల చేయక తప్పలేదు. అయినా ప్రభుత్వం తన కక్ష సాధింపు ధోరణిని మార్చుకోలేదు. ఎన్.ఎస్.ఎ కేసు వీగిపోయిన తర్వాత కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఈ పూర్వ రంగాన్ని, జెన్‌ జీ ఉద్యమం వల్ల తాను ఇటీవల ఎదుర్కొన్న పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆకృతిని యు.పి ప్రభుత్వం ఇంతటితో వదలిపెడ్తుందా? అన్నది అనుమానమే. ఇప్పుడామె ‘దిమాగీ నక్సల్‌’ కేటగిరీలోకి వస్తారేమో! ఏదేమైనా ఈ కేసులో బాధితురాలికి జిల్లా కలెక్టర్‌ నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించడం ఒక హైలెట్‌.


వ్యాసకర్త : ఎస్‌. వినయ కుమార్‌

‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు,

సెల్‌: 9989718311

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్