మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పింఛన్‌ పరేషాన్‌

1 గంట క్రితం

pension
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కొత్త సామాజిక పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో ఎప్పుడెప్పుడని రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లక్షల మంది అభాగ్యుల్లో ఆశలు చిగురించాయి. ఇదే సమయంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు వారిని కలవరపెడుతున్నాయి. అవన్నీ దాటుకొని పింఛన్‌‌కు అర్హత లభిస్తుందా లేదా అన్న ఆందోళనలు ఆశావహులను చుట్టుముట్టాయి. ఏ ఆధారం లేని సమాజంలోని కొన్ని తరగతులు కనీస జీవనం సాగించేందుకు ప్రభుత్వాలు పెన్షన్లను అందిస్తున్నాయి. ధరలతో పోల్చుకుంటే సర్కార్‌ ఇచ్చే పింఛన్‌ ‌సొమ్ము నామమాత్రమే అయినా, ఆ కొద్ది ఆసరా కోసం పరితపించే వారు లక్షల్లో ఉన్నారు. ఎన్నికల్లో టిడిపి కూటమి తన మేనిఫెస్టోలో పింఛన్‌ ‌సొమ్ము పెంచుతామని, అర్హులైన వారందరికీ ఇతోధికంగా పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం రాగానే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు చేసింది. వికలాంగులకు, క్యాన్సర్‌, డయాలసిస్‌, ఇత్యాది తీవ్ర ఆనారోగ్య బాధితులకు సైతం పింఛన్‌ ‌మొత్తాన్ని పెంచింది. పింఛన్‌ ‌పెంపు లబ్ధిదారుల్లో సంతోషం కలిగించింది. కాగా కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ ఏట ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్‌ ‌మంజూరుకు నోచుకోలేదు. కుటుంబంలో భర్త చనిపోతే అర్హత ఉంటే భార్యలకు వృద్ధాప్య పింఛన్లు, అవీ స్వల్ప సంఖ్యలోనే మంజూరు చేశారు. కొత్తగా పింఛన్‌ కోసం లక్షల సంఖ్యలో ఎదురు చూస్తుండగా ప్రభుత్వం ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆశావహుల్లో అసహనం, అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. కూటమి పాలనలో నగదు బదిలీ పథకాలు ఆగిపోవడం, పెరుగుతున్న ధరలతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబంధనల పేరుతో పింఛన్లను అడ్డుకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని పాలకులు గుర్తించాలి.

కూటమి సర్కార్‌ వచ్చే నాటికి రాష్ట్రంలో పింఛన్లన్నీ కలుపుకొని 66 లక్షలకుపైన ఉండగా ఈ రెండేళ్లల్లో ఐదారు లక్షల వరకు తొలగించారు. కూడికలు తీసివేతలు పోను ఈ సెప్టెంబర్‌‌లో ప్రభుత్వం పంపిణీ చేసింది 59 లక్షలేనని ఒక లెక్క. ప్రభుత్వం ఆ సర్వే ఈ సర్వే అనడంతో ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారిలో భయాలు కలిగిస్తున్నాయి. ఊహించినట్లుగానే లక్షల్లో పింఛన్లు రద్దయ్యాయి. సదరం ధృవీకరణ పేరిట వికలాంగులను పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. కొత్తవి మాటేమో, ఉన్నవారివి పోతాయని పెద్ద అలజడి లేచింది. ఈ ప్రభుత్వం వచ్చాక 60 సంవత్సరాలు నిండి వృద్ధాప్య పింఛన్‌ ‌కోసం అర్జీలు పెట్టుకొని ఎదురు చూస్తున్నవారు లక్షల్లో ఉన్నారు. కాగా ఇప్పుడూ ప్రభుత్వం సజావుగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందన్న గ్యారంటీ లేదని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ‌జారీ చేసిన ఉత్తర్వులతో అనుమానించాల్సి వస్తుంది. గతంలో అర్జీలు ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో పెట్టుకునేందుకు అవకాశం ఉండగా కూటమి ప్రభుత్వం పోర్టల్‌‌ను లాక్‌ ‌చేసింది. అర్జీదారులు ఇ-కెవైసి సహా అన్ని ధృవ ప్రతాలతో కేవలం ఏడు రోజుల్లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకెళ్లి ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు గ్రామ సభల్లో, లేదంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసుకున్న అర్జీలను పరిశీలించి పింఛన్‌ ‌మంజూరు చేసే అధికారం ఎంపిడిఒ లకు, మున్సిపల్‌ ‌కమిషర్లకు ఉండేది. ఇప్పుడు ప్రతి పింఛనూ రాష్ట్ర స్థాయిలో మంజూరవుతుందన్నారు. అర్హత సాధించిన వాటినీ కొన్ని దశల్లో పంపిణీ చేస్తామన్నారు. అవి కూడా బడ్జెట్‌, నిధుల లభ్యత ఆధారంగా చెల్లిస్తారు. ప్రస్తుతం అర్జీలేనని, పింఛన్‌ ఇవ్వడానికి సమయం పడుతుందని అర్థమవుతుంది. ఈ హడావిడి చూస్తుంటే, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల స్టంట్‌‌గా అనిపిస్తుంది. ప్రభుత్వం చేసిన ఐవిఆర్‌ఎస్‌, సహా పలు అధ్యయనాలు, సర్వేలలో కొత్త పింఛన్లను ఆశిస్తున్న వారిలో అసంతృప్తి పెద్ద స్థాయిలో ఉందని గుర్తించినట్లు బయటికొచ్చింది. ప్రస్తుత అర్జీల ప్రహసనం ఆయా తరగతుల్లో అసంతృప్తిని చల్లార్చే ఎత్తుగడగా కనిపిస్తుంది. ఎస్‌సి, ఎస్‌‌టి, బిసి, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని టిడిపి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనగా ఆ ఊసే లేదు. సామాజిక భద్రత పింఛన్‌ కేంద్ర ప్రభుత్వం రూ.200 నుంచి రూ.500 ఇస్తోంది. అవీ పరిమిత సంఖ్యలోనే. కొన్నేళ్లుగా ఇంతే. పెంపు కోసం కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలి. పింఛన్లనేవి భిక్ష కాదు. సమాజంలో ఏ దిక్కు లేని వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం కల్పించే కనీస ఆర్థిక భద్రత. ఇది ప్రభుత్వాల బాధ్యత. ఎన్నికల స్టంట్‌‌గా మారిస్తే ప్రజలు ఊరుకోరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్