- ఎన్‌టిఆర్ జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు
- 291 చెరువులు ఖాళీ.. కుదేలైన వ్యవసాయం
- ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, నిత్యవసరాల ధరల మంట
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఆశాజనకంగా కనిపించిన వర్షపాతం... రోజులు గడిచే కొద్దీ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లా వ్యాప్తంగా జలవనరులు పూర్తిగా అడుగంటిపోవడంతో ఎన్‌టిఆర్ జిల్లాలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. కృష్ణా బేసిన్‌లో ఎగువన నీరు లేకపోవడం, ప్రకాశం బ్యారేజీ మినహా జిల్లాలోని మొత్తం 291 చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో ప్రధాన పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. వర్షాలు లేక స్థానిక నీటి వనరులు ఎండిపోవడంతో ఒకవైపు వ్యవసాయ కార్మికుల ఉపాధి దెబ్బతినగా, మరోవైపు మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మేరకు జిల్లా వ్యవసాయ, మైనర్ ఇరిగేషన్, భూగర్భ జల శాఖల అధికారిక గణాంకాలు ఈ సంక్షోభ తీవ్రతను తెలుపుతున్నాయి.
జిల్లా వ్యవసాయ శాఖ ఉమ్మడి నివేదిక ప్రకారం... జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,35,317 ఎకరాలు కాగా, ప్రస్తుత కరువు పరిస్థితుల వల్ల కేవలం 1,49,350 ఎకరాలు (63 శాతం) మాత్రమే సాగు ప్రారంభమైంది. సుమారు 37 శాతం భూములు సాగుకు నోచుకోలేదు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,22,077 ఎకరాలు కాగా 66.005 ఎకరాల్లో (54 శాతం) మాత్రమే నాట్లు పడ్డాయి. పత్తి సాధారణ విస్తీర్ణం 85,142 ఎకరాలు కాగా 57,297 ఎకరాల్లో (67 శాతం) మాత్రమే సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి పంట కూడా దక్కలేదు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14,317 ఎకరాలు కాగా 7765 ఎకరాల్లో (53 శాతం) పంట వేశారు. మినుములు 7332 ఎకరాలకు గానూ 5067 ఎకరాల్లో సాగు అయింది. నీటి వినియోగం తక్కువగా ఉండే పెసర పంట మాత్రం సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా 11917 ఎకరాలు (126 శాతం) సాగైంది. సాగు విస్తీర్ణం భారీగా పడిపోవడంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు రోడ్డున పడ్డారు.
ఎండిపోయిన 291 చెరువులు
జిల్లా పరిధిలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను గమనిస్తే... మున్నేరులో నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటింది. గత ఏడాది ఇదే సమయానికి 0.13 టిఎంసి నీరుంది. ఎ.కొండూరు పరిధిలోని శ్రీ నందమూరి తారక రామారావు రిజర్వాయర్ ( 0.21 టిఎంసి) నిల్వలు కూడా అట్టడుగుకు చేరి మెట్ట ప్రాంత తాగునీటి సరఫరాకు కూడా సరిపోవడంలేదు. మైనర్ ఇరిగేషన్ శాఖ తాజా నివేదిక ప్రకారం జిల్లాలోని మొత్తం 439 మైనర్ ఇరిగేషన్ చెరువుల నిల్వ సామర్థ్యం 10,443.29 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసిఎఫ్‌టి) కాగా ప్రస్తుతం కేవలం 1,779.97 ఎంసిఎఫ్‌టి (17 శాతం) నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 291 చెరువులు (0 శాతం నిల్వలు) పూర్తిగా ఎండిపోయి పగుళ్లు తీశాయి. జిల్లా మొత్తంలో 19 చెరువులు మాత్రమే వంద శాతం నిల్వతో ఉండగా, 75 శాతం నిల్వతో 20 చెరువులు, 50 శాతం నిల్వతో 53 చెరువులు, 25 శాతం నిల్వతో 56 చెరువులు మాత్రమే ఉన్నాయి. గ్రామాల్లోని చెరువులలో నీరు లేకపోవడం వల్ల పశుగ్రాసం, పశువుల తాగునీటికి కూడా గుక్కెడు నీరు లేదు.
వేసవిని మించిన జల సంక్షోభం
జిల్లావ్యాప్తంగా సగటు భూగర్భ జల మట్టం గత ఏడాది 3.71 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 6.19 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే గడిచిన ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు సగటున 2.48 మీటర్ల లోతుకు పడిపోయాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో రెడ్డిగూడెం మండలంలో గత ఏడాది నీటి మట్టం 12.15 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం అది 14.88 మీటర్ల లోతుకు పడిపోయింది. ఎ. కొండూరులో గత ఏడాది 3.20 మీటర్ల లోతులోనే నీరు లభించగా, ప్రస్తుతం ఏకంగా 8.91 మీటర్ల లోతుకు అడుగంటింది. విస్సన్నపేటలో గత ఏడాది 3.53 మీటర్ల వద్ద ఉన్న భూగర్భ జలాలు, ఇప్పుడు దాదాపు రెట్టింపు లోతుకు అంటే 6.97 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాకాలం ముగియక ముందే ఈ ప్రాంతాల్లో వేసవిని మించిన జల సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రకాశం బ్యారేజ్ మినహా అన్నీ నిల్
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం 3.07 టిఎంసిల పూర్తి సామర్థ్యంతో (100 శాతం) నిండు కుండలా ఉంది. ఎగువ నుండి 6,816 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తాన్ని కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నిండుగా ఉన్నప్పటికీ ఎగువన ఉన్న ఇతర ప్రధాన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటం వల్ల జిల్లాలోని అంతర్గత, మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. కృష్ణా బేసిన్ లోని శ్రీశైలం ప్రాజెక్ట్ మొత్తం 215.81 టిఎంసిల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం (7.9.26) 134.250 టిఎంసిల నిల్వతో మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 205.23 టిఎంసిల నీరు ఉంది. అలాగే నాగార్జున సాగర్ మొత్తం 312.05 టిఎంసిల సామర్థ్యానికి గానూ ప్రస్తుతం కేవలం 179.083 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి సాగర్‌లో 300.32 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న ఈ ప్రధాన డ్యామ్‌లలో నీటి నిల్వలు తగ్గడం వల్ల కాలువలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల జరగడం లేదు. ఇది రానున్న రబీ సాగుపై కూడా కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది.
పడిపోయిన ఉపాధి - పెరిగిన ధరలు
రోజువారీ పనులతో బిజీగా ఉండాల్సిన వ్యవసాయ కార్మికులు గ్రామాల్లో పని దొరకక ఖాళీగా ఉంటున్నారు. ఉపాధి హామీ పనులు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మెట్ట ప్రాంతాల నుండి నగరాలకు వలస బాట పడుతున్నారు. మరోవైపు, స్థానిక పంటల దిగుబడి తగ్గిపోతుందనే అంచనాలతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా సాధారణ రకం బియ్యం, పప్పుధాన్యాలు, నూనెలు, నిత్యం వాడే కూరగాయల ధరలు సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను దాటిపోతున్నాయి. ఒకవైపు చేతిలో పని లేక ఆదాయం పడిపోవడం, మరోవైపు మార్కెట్‌లె నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో జిల్లా ప్రజలు కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. తక్షణమే స్పందించి కరువు మండలాలను ప్రకటించాలని, నష్టపోయిన రైతాంగానికి, కార్మికులకు ప్రభుత్వ సహాయం అందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రూ.30 వేల వరకు నష్టం
అరెకర సొంత పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి నాట్లు వేశాను. ఇప్పుడు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. మాకు చెరువు నీరే ఆధారం. వర్షాలు లేవు, కాల్వల్లో నీరు రావడం లేదు. వెంటనే వర్షం పడకపోతే నాకు మొత్తం రూ.30 వేల వరకు పెట్టుబడి నష్టం వస్తుంది. ఎంతో కష్టపడి వేసిన నాట్లు కళ్లముందే ఎండిపోతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సాగునీరందించి ఆదుకోవాలి.
- వేముల హరికృష్ణ, రైతు, తిరువూరు







కామెంట్‌లు (0)