- ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం
- సంతకాలు చేసిన మారిటైం బోర్డు, మజగాన్
- ఏటా 12 లక్షల టన్నుల సామర్ధ్య ఓడల నిర్మాణం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అనుకున్నట్టుగానే దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం పనులు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్)కే దక్కాయి. ఈ మేరకు శుక్రవారం కీలక ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో సచివాలయంలో ఎపి మారిటైమ్ బోర్డు, విశాఖ పట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్‌పివి నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ – ఎపి, ఎండిఎస్‌ఎల్ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర రక్షణ రంగానికి చెందిన ఈ సంస్థకే ఆ పనులు అప్పగించాలని తొలుతే భావించినప్పటికీ ఆ తరువాత అనేక దేశాల నిర్మాణ సంస్థలను సంప్రదించారు. చివరకు ‘మజగాన్’కే అప్పగించాలని నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం కోసం వచ్చే ఐదేళ్లలో ఎండిఎల్ ఈ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు, మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసెస్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఏటా 12లక్షల టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా వీలుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా ఈ షిప్‌యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా నౌకలను నిర్మించే సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సమగ్ర నౌకా నిర్మాణ క్లస్టర్
దుగరాజపట్నంను షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపింది. షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీం కింద అభివృద్ధి చేయనున్నారు. ఈ క్లస్టర్‌కు మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ను యాంకర్ షిప్‌యార్డ్‌గా ఎంపిక చేశారు. జాతీయ షిప్‌బిల్డింగ్ లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను 2047 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి షిప్‌బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యానికి దుగరాజపట్నం ప్రాజెక్టు దోహదపడనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, కేంద్ర ప్రభుత్వ షిప్ బిల్డింగ్ డెవలప్‌మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి, ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎండిఎల్ సిఎండి జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)