- ఎల్‌నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయంగా రైతుల మొగ్గు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది పత్తి సాగు పెరగనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు ఇతర పంటల కన్నా పత్తి సాగుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ర్టంలో 12.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు అవకాశం ఉండగా, గత ఏడాది ఖరీఫ్ ఆఖరు నాటికి ఎనిమిది లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. గతేడాది ఆగస్టు మొదటి వారం వరకూ ఆరు లక్షల ఎకరాల్లోనే పత్తి వేయగా, ఈ ఏడాది ఇప్పటికే 7.25 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. అత్యధికంగా కర్నూలులో ఈ ఏడాది ఇప్పటికే ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, పల్నాడు, ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలో పత్తి సాగు ఈ ఏడాది 12 లక్షల ఎకరాల వరకు సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్‌టిఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో వరి సాగుకు సాగర్ జలాలు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అధికారులు సూచిస్తున్న పంటల కన్నా రైతులు సంప్రదాయ పంటల వైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో వరి, పత్తి, మిర్చి పంటలపైనే ఎక్కువగా సాగు చేస్తారు. ఈ మూడు పంటలు కాకపోతే కంది సాగుకు మొగ్గుచూపుతారు. వరికి ప్రత్యామ్నాయంగా ఈసారి రైతులు పత్తి వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం 14 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 4.83 లక్షల ఎకరాల్లో వరి, 9,99,919 ఎకరాల్లో మెట్ట పంటలు వేస్తారు. మెట్ట పంటలో ప్రధానంగా పత్తి, మిర్చి, కంది, ఇతర పప్పుదినుసులు ఉన్నాయి. మొత్తం 9.99 లక్షల ఎకరాల మెట్ట భూముల్లో మూడున్నర లక్షల ఎకరాల్లో మిర్చి, నాలుగున్నర లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో కంది ఇతర పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది వరి స్థానంలో కొంతమంది రైతులు పత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో 55 వేలు ఎకరాలు, అనంతపురంలో 50 వేలు, కడపలో 15 వేలు, గుంటూరు జిల్లాలో 15 వేల ఎకరాల్లో పత్తి సాగు నమోదైంది. మెట్ట ప్రాంతంలో కాల్వలకు నీరు వస్తే వరి సాగు, నీరు రాకపోతే పత్తి, మిర్చి సాగు సాగర్ ఆయకట్టులో చేస్తుంటారు. మాగాణి ప్రాంతంలో వరి తప్ప, ఇతర పంటలకు అవకాశం లేనందున ఈ ప్రాంతాల రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వరి, పత్తి సాగు చేయని వారు ఎక్కువ మంది కంది వైపు మొగ్గుచూపుతున్నట్టు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)