మరణించిన అభ్యర్థికి వరించిన విజయం..
368 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి దివ్య గెలుపు
ప్రజాశక్తి -దేవరపల్లి (తూర్పుగోదావరి జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధూమంతునిగూడెం ఎంపిటిసి స్థానంలో జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (28) మృతితో గ్రామంలో విషాదం నెలకొన్నప్పటికీ, ఎన్నికల ఫలితాల్లో ఆమె విజయం సాధించారు. గుండెపోటుతో ఈ నెల ఆరున మరణించిన ఆమెకు శనివారం వెలువడిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై 350 ఓట్ల మెజారిటీ లభించింది. గెలుపు వరించిన వేళ ఆమె లేకపోవడం గ్రామస్తులను, కుటుంబ సభ్యులను కలచివేసింది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధూమంతునిగూడెంలో జనసేన ఎంపిటిసి అభ్యర్థి గారపాటి దివ్య ఈ నెల ఆరున మరణించారు. డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. గారపాటి శ్రీనివాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో దివ్య ఓటు వేశారు. అదే రోజు సాయంత్రం ఛాతిలో నొప్పికి గురయ్యారు. వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇంటికి తీసుకురాగా శుక్రవారం ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ప్రజాశక్తి - ఆలూరు (కర్నూలు జిల్లా)
కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక్కో పార్టీకి ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వడంపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు ఏజెంట్లకు పాసులు జారీ చేసి, ఇప్పుడు ఒక్కరికే అనుమతించడంపై ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు ఇరు గ్రూపులపై లాఠీఛార్జి చేయగా, ఇద్దరు వైసిపి ఏజెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వైసిపి ఏజెంట్లకు అనుమతి నిరాకరించారని ఆరోపిస్తూ వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కౌంటింగ్ హాల్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. టిడిపి ఏజెంట్లకు మాత్రమే అనుమతిచ్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులోని తన స్వగృహంలో వైసిపి యువనేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసి, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మిగనూరు కౌంటింగ్ కేంద్రంలోకి టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్‌ను పాస్ లేకుండానే లోపలికి పంపడంతో వైసిపి నాయకులు గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఆళ్లగడ్డలో మూడు కార్లు, రెండు మోటార్ బైకులు దహనం
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం పుల్లారెడ్డి వీధి సమీపంలో శనివారం తెల్లవారుజామున మూడు కార్లు, రెండు మోటార్ బైకులను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానికుల కథనం ప్రకారం... స్థానిక ఎఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమాని హుస్సేన్ బాషా ఇంటి వద్ద ఆపి ఉంచిన వాహనాల్లో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమీపంలో పార్కు చేసిన మరో కారు పాక్షికంగా దెబ్బతింది. రెండు మోటార్ సైకిళ్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే, ఇటీవల జరిగిన మున్సిపాల్టీ ఎన్నికల్లో హుస్సేన్ బాషా భార్య వైసిపి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే హుస్సేన్ బాషా రెండో కుమారుడు సాధిక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దాడి చేసింది ఎవరన్నది ఇంతవరకూ బహిర్గతం కాలేదు. వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని బాషా ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి, వైసిపి రాజీపడి 60 : 40 లెక్కన సీట్లు పంచుకున్నారు. ఏకగ్రీవాలయ్యాక ఎందుకు ఈ ఘటన జరిగిందనేది ప్రశ్న. కానీ ఘటనకు కారకులెవరనేది పోలీసులు ఇంకా తేల్చలేదు. బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పిరెడ్డిపై ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వెంగళాయపాలెం పరిషత్ ఎన్నికల్లో అప్పిరెడ్డి ఆధ్వర్యాన వైసిపి వర్గీయులు తీవ్ర హింసాకాండకు పాల్పడి, బ్యాలెట్ బాక్సును బలవంతంగా లాక్కెళ్లారని టిడిపి బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున, ఐజి రాజకుమారిని శనివారం విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ మంత్రి, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్పర్సన్ పీతల సుజాత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్ లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. ఎన్నికలు అడ్డుకోవాలని అల్లర్లు సృష్టిస్తున్న వైసిపిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వర్ల మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలనే దురుద్దేశంతో వైఎస్ జగన్ కుట్రలు, దురాలోచనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హింసాత్మక ఘటనలు, ఆధారాలపై తక్షణమే విచారణ జరిపి చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.
40 యేళ్ల తరువాత ఎంపిటిసి ఎన్నికలు
- ఆ రెండు స్థానాలూ వైసిపి కైవసం
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో 40 సంవత్సరాల తొలిసారి ఎన్నికలు జరిగిన రెండు ఎంపిటిసి స్థానాలను వైసిపి గెల్చుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి స్వగ్రామైన కడిమెట్ల గ్రామంలో శనివారం వెలువడిన ఫలితాల్లో రెండు స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. గత 40 సంవత్సరాలుగా కడిమెట్ల 1 ఎంపిటిసి (కడిమెట్ల గ్రామం) కడిమెట్ల 2 ఎంపిటిసి (ఎర్రకోట, రాళ్లదొడ్డి శ్రీరాల దొడ్డి గ్రామాలు) స్థానాలకు ఏకగ్రీవాలు జరిగేవి. అయితే, ఈ స్థానాల్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కడిమెట్ల 1 ఎంపిటిసి స్థానంలో 2,588 ఓట్లు పోలవగా వైసిపి అభ్యర్థి బి.నర్సమ్మకు1,384 ఓట్లు, టిడిపి అభ్యర్థి బి.చిట్టమ్మకు 759 ఓట్లు వచ్చాయి. 625 ఓట్లు మెజార్టీతో వైసిపి కైవసం చేసుకుంది. కడిమెట్ల 2 ఎంపిటిసి స్థానంలో 2,658 ఓట్లు పోలవగా వైసిపి అభ్యర్థి నరసింహుడుకు 1,523 ఓట్లు, టిడిపి అభ్యర్థి వెంకట రాముడుకు 639 ఓట్లు వచ్చాయి. 884 ఓట్ల మెజార్టీతో వైసిపి గెలుపొందింది.
జైల్లో ఉన్నా వరించిన విజయం
@పెళ్లకూరులో వైసిపి జెడ్పిటిసిగా *సత్యనారాయణరెడ్డి గెలుపు
ప్రజాశక్తి - నాయుడుపేట (తిరుపతి జిల్లా)
జైల్లో ఉన్నా విజయం వరించింమది. వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,719 ఓట్లతో విజయం సాధించారు. అ విజయంలో ఆయన జీవిత భాగస్వామి కీలక పాత్ర పోషించారు. రాజకీయ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాతీర్పు వచ్చింది. ఇది పెళ్లకూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలులో ఉన్న సమయంలో ఆయన జీవిత భాగస్వామి నామినేషన్ వేసి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. కుటుంబ పరిస్థితులు ఒకవైపు.. రాజకీయ సవాళ్లు మరోవైపు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు ప్రజాతీర్పుతో సమాధానం చెప్పించారు... రెండు నెలల క్రితం జరిగిన ఓ గొడవలో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి జైలులో ఉన్నారు.
కృష్ణాజిల్లాలోనూ కూటమి విజయం
- గన్నవరంలో రీ కౌంటింగ్ జరిపినా వైసిపిదే విజయం
ప్రజాశక్తి - ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి: కృష్ణాజిల్లా జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూటమిదే హవా సాగింది. కృష్ణాజిల్లాలో రాత్రి పది గంటలకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 26 జెడ్పిటిసి స్థానాలకుగానూ 24 స్థానాల ఫలితాలను ప్రకటించారు. వీటిలో టిడిపి 19, జనసేన 4, బిజెపి 1, వైసిపి 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. గన్నవరం జడ్పిటిసి స్థానంలో వైసిపికి ఆధిక్యత రాగా, బిజెపి అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ రీ కౌంటింగ్ జరిపినా వైసిపి అభ్యర్థే విజయం సాధించారు. మొత్తం 352 ఎంపిటిసిలకు గానూ రాత్రి తొమ్మిది గంటల వరకు 108 స్థానాల ఫలితాలను ప్రకటించారు. వీటిలో టిడిపి 67, జనసేన 10, బిజెపి 2, వైసిపి 22, సిపిఎం 2, సిపిఐ 1, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.







కామెంట్లు (0)