శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదలకు సొంతిల్లు.. శాశ్వత హక్కుగా మారుతోంది : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

Homes for the poor are becoming a permanent right: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్రంలో పేదలకు కలగా ఉన్న సొంతిల్లు.. ఇక శాశ్వత హక్కుగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. శనివారం విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని.. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో సిఎం పోస్ట్‌ చేశారు. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదని, 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం అని అన్నారు. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుందన్నారు. భవిష్యత్తుకు భద్రత కలుగుతుందని చెప్పారు. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుందన్నారు. ఆత్మగౌరవం, భరోసా దక్కుతుందన్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటి పై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నామన్నారు. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నామని, వారిని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నామని సిఎం చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్