శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళ స్కూల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ ప్రభంజనం: 604 స్థానాల్లో ఘనవిజయం

1 గంట క్రితం

కేరళ స్కూల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ ప్రభంజనం: 604 స్థానాల్లో ఘనవిజయం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం:

కేరళ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్కూల్ పార్లమెంట్ ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) చారిత్రాత్మక విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన 699 పాఠశాలల్లో ఏకంగా 604 పాఠశాలలను కైవసం చేసుకుని తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికే 148 పాఠశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఏకగ్రీవంగా ఎన్నికైంది.


రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. మలప్పురం (9/9), ఎర్నాకుళం (4/4), కొట్టాయం (11/11) జిల్లాల్లో పోటీ చేసిన అన్ని స్థానాలనూ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే కాసర్‌గోడ్ (40/48), కన్నూర్ (93/109), వయనాడ్ (11/15), కోజికోడ్ (40/65), పాలక్కాడ్ (69/79), త్రిస్సూర్ (38/40), ఆలప్పుళ (40/43), కొల్లాం (104/117), పతనంతిట్ట (35), తిరువనంతపురం (86/91) జిల్లాల్లో అత్యధిక పాఠశాలలను గెలుచుకుంది.


కీలక పాఠశాలల్లో తిరుగులేని ఆధిక్యం:

కాసర్‌గోడ్‌లోని ఉడుమ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏడేళ్ల తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ మళ్లీ అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. పానూర్ పిఆర్, కేవి స్కూళ్లను ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎమ్‌ఎస్‌ఎఫ్) నుంచి తిరిగి దక్కించుకుంది. త్రిస్సూర్ జిల్లా ముల్లూర్కర ఎన్ఎస్ఎస్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో యునైటెడ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (యుడిఎస్‌ఎఫ్) కూటమిని ఓడించి 10కి 10 సీట్లు సాధించింది. అలాగే పెరియా హయ్యర్ సెకండరీ స్కూల్‌ను కెఎస్‌యు నుండి తిరిగి వశం చేసుకుంది.


విద్యార్థి లోకం ఘన విజయం:

విద్యారంగంలో పెరుగుతున్న కాషాయీకరణకు వ్యతిరేకంగా "సోషలిజమే భవిష్యత్తు - లౌకికత్వమే బలం" అనే నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. విద్యా వ్యతిరేక విధానాలను, సంఘ్ పరివార్ ఐడియాలజీతో లాలూచీ పడుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వ వైఖరిని విద్యార్థులు ఈ తీర్పు ద్వారా తిరస్కరించారని ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ పేర్కొంది.


ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన విద్యార్థులకు, శ్రేణులకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సెక్రటేరియట్ అభినందనలు తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్