కాన్పూర్ : ఒక వైద్యునికి చెందిన కారు డ్రైవర్ రోగులను పరీక్షించి, మెడిసిన్స్ రాసిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. కాన్పూర్‌లోని కాన్సీరామ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈనెల 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (ఇఎంఒ) రామ్‌కేష్ కోర్టు విచారణ కోసం వెళ్లారు. ఆసమయంలో అవుట్ పేషెంట్ విభాగం (ఒపిడి)లో చికిత్స కోసం రోగులు వచ్చారు. కారు డ్రైవర్ దేవ్ వారిని పరీక్షించి, ప్రిస్కిప్షన్‌పై మెడిసిన్స్ రాసి ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పీయూష్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఒ) హరిదత్ నెమి తెలిపారు. ఇది ఆరోజే జరిగిందా లేదా గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయా అన్న కోణంలో విచారిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆరోజు ఎంతమంది రోగులను పరీక్షించారు, ఏ మందులు రాసిచ్చారు అన్న వివరాలు తెలియాల్సి వుంది. ఆ వీడియో బయటకు రావడానికి ఒక రోజు ముందు, అంటే మంగళవారం ఆస్పత్రిని తనిఖీ చేశామని, అయితే ఆ సమయంలో బయటి వ్యక్తులు ఎవరూ కనిపించలేదని మిశ్రా తెలిపారు. ఈఘటనపై వివరణనివ్వాల్సిందిగా రామకేష్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చామని అన్నారు.








కామెంట్‌లు (0)