కేంద్ర బృందానికి సిపిఎం వినతి
ఎకరా వరి పంటకు రూ.25 వేలు, ఉద్యాన పంటలకు రూ.లక్ష చెల్లించాలి
48 గంటల్లో పంట నష్టాల అంచనా పూర్తి చేయాలి
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో బాధిత రైతులకు తక్షణ సహాయం, నష్టపరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, రాజ్యసభ సభ్యులు వి శివదాసన్ సంతకం చేసిన వినతిపత్రం అందజేశారు. అక్టోబరు 26, 27, 28 తేదీల్లో పడిన భారీ వర్షాలు, వీచిన బలమైన గాలుల కారణంగా పశ్చిమగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, బొప్పాయి, కూరగాయలు, మిరప, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పొలాల్లో ఇసుక, బురద మేటలు వేశాయని, గట్లు, బోర్లు దెబ్బతిన్నాయని వివరించారు. కాలువలు, మురుగునీటి డ్రెయిన్లు పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలు నేలకూలి తీగలు తెగిపోయాయని పేర్కొన్నారు. చెట్లు కూలడంతోపాటు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. పంటల సాగు కోసం రైతులు భారీగా అప్పులు చేశారని, తుపాను కారణంగా వారి జీవనాధారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు పడవలు, వలలు కోల్పోయారని, చేనేత కార్మికులతోపాటు గేదెలు, మేకలు, గొర్రెలను పెంచుకునేవారూ నష్టపోయారని వివరించారు.
‘పంట నష్టాలను వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు, రైతు సంఘం ప్రతినిధులతో కూడిన సంయుక్త బృందం ద్వారా అంచనా వేసి 48 గంటల్లో పూర్తి చేయాలి. పంటల బీమా చెల్లించినా, చెల్లించకపోయినా నష్టపోయిన రైతులందరికీ బీమా పరిధిలో పరిహారం అందేలా చట్టాలను సవరించాలి. కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలి. ఇ-క్రాప్, పంట కోత ప్రయోగాల వివరాలపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. సర్వే జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి రైతుల అభ్యంతరాలను స్వీకరించాలి. ఎకరా వరి పంటకు రూ.25 వేలు, ఉద్యాన పంటలకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు పరిహారం పెంచాలి. దెబ్బతిన్న ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు చెల్లించాలి. వ్యవసాయ మోటార్లు, యంత్రాలు, పరికరాలు, పశువుల నష్టాలనూ పరిహారంలో చేర్చాలి. పంట నష్టపోయిన రైతులకు 15 రోజుల్లో పరిహారం అందించాలి. పంటల బీమా కింద 25 శాతం మధ్యంతర పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. బీమా కంపెనీలు సర్వేలో జాప్యం చేయకుండా ఆదేశించాలి.పాత పంట రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు అందించాలి. వడ్డీ లేకుండా పాత రుణాలను తిరిగి చెల్లించేలా పునర్ వ్యవస్థీకరించాలి. తిరిగి సాగు చేసేందుకు నాణ్యమైన విత్తనాలు, తక్కువ కాలపరిమితి గల విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలి. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు డ్రెయిన్లలో అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి. వ్యవసాయ కార్మికులు, ఎస్‌సి, ఎస్‌టిలు, చేతివృత్తిదారులకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు, మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పునరుద్ధరణ కోసం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలి’ అని సిపిఎం నేతలు కోరారు.






కామెంట్‌లు (0)