ఎంపిటిసి, జెడ్పిటిసి ఓటింగ్‌కు సర్వం సిద్ధం
582 జెడ్పిటిసి, 7767 ఎంపిటిసి స్ధానాలకు ఎన్నికలు
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : గురువారం జరగనున్న ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బంది పోలింగ్ సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 659 జెడ్ పిటిసి స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 9,821 ఎంపిటిసి స్థానాలకుగాను 2,051 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 18,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 8,904, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 7,160 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సంసిద్ధతపై కమిషనర్ సమీక్షించారు. భారీ వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రవాణా, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఓటర్ల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, పోలీసు బలగాల మోహరింపునకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎ మల్లికార్జున వెల్లడించారు. వీడియో రికార్డింగ్ సమయంలో ఓటు రహస్యానికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ పాల్గొన్నారు.
5 మండలాల్లో ఎన్నికలు 6వ తేదీకి వాయిదా
పెదవాగు ప్రాజెక్టు రింగ్‌బండకు గండితో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిల్చిపోయాయి. దీంతో, బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు 6వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. వీటితో పాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను కూడా 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇసి ప్రకటించింది.







కామెంట్‌లు (0)