పేదలను సంక్షేమానికి దూరం చేయొద్దు
సిపిఎం ఖండన
న్యూఢిల్లీ : సంక్షేమ పథకాల చెల్లింపులకు ప్రాతిపదికగా ఆధార్‌కు బదులుగా బయోమెట్రిక్స్‌ను, ఓటర్ ఐడి (ఎపిక్)ను తీసుకు వస్తామంటూ పంచాయితీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రకటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. గ్రామీణ పేదలపై ఇది మరో దాడి అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్రామీణ ఉపాధి పథకాల్లో వ్యవసాయ కార్మికులకు బయోమెట్రిక్‌ను ప్రామాణీకరించడం ఏ విధంగా ప్రవేశాన్ని నిరాకరించిందో ఇప్పటికే పదే పదే రుజవైంది. చాలామంది వృద్ధులైన మహిళా కార్మికులకు వారి కనురెప్పల (ఐరిస్)ను యంత్రాలు గుర్తించడంలో విఫలం కావడంతో వారికి అందాల్సిన ప్రయోజనాలు అందలేదు. అలాగే శారీరక శ్రమ చేసే కూలీలకు కూడా వారి అరిగిపోయిన వేలిముద్రలను బయోమెట్రిక్ వ్యవస్థ సరిగా పోల్చకపోవడంతో వారిని కూడా మినహాయిస్తున్నారు. ఇ-కెవైసికి స్మార్ట్ ఫోన్లు అవసరమవుతున్నాయి. చాలామంది గ్రామీణ కుటుంబాలకు అటువంటి ఫోన్లు వుండవని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఆధార్‌ను తప్పనిసరి చేయబోమని గతంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ సంక్షేమ పథకాలన్నింటిలోనూ దాన్ని రహస్యంగా విధించే ప్రయత్నం జరుగుతోంది. కానీ, లోపరహితమైనదిగా గొప్పగా చెప్పుకున్న ఆధార్‌ని ఇప్పుడు ప్రభుత్వమే పక్కనబెడుతోందని సిపిఎం విమర్శించింది. ఓటింగ్ హక్కులపై సర్జికల్ దాడిగా, మూకుమ్మడిగా ఓటు హక్కులను తొలగించేందుకు ఒక పద్ధతి ప్రకారం సాగే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో పాటే దీన్ని కూడా చూడాల్సి వుంది. ఇప్పటికే 13.4కోట్ల మందికి పైగా ఓటర్లను తొలగించారు. వీరిలో వెనుకబడిన కమ్యూనిటీలు, ముస్లింలు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు ప్రధానంగా ప్రభావితుల య్యారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఇప్పుడు, సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడి కావాలనడం వల్ల పేదలకు మరింతగా దూరమవుతాయి. ఇప్పటికే, ఎస్‌ఐఆర్ ద్వారా పేర్లు తొలగించబడ్డాయనే సాకుతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్, ఇతర ప్రయోజనాలను నిరాకరిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన అది సామాజిక సంక్షేమ అర్హతలను ప్రభావితం చేయరాదన్న సుప్రీం కోర్టు రూలింగ్‌ను ఇది స్పష్టంగా ఉల్లంఘించడమేనని సిపిఎం పేర్కొంది.
ఈ ఎత్తుగడలన్నీ కూడా మెజారిటీ ప్రజలకు ప్రయోజనాలు అందకుండా నిరాకరించేందుకు కట్టుదిట్టంగా జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. గ్రామీణ నిరుపేదలకు అందుబాటులో లేని సాంకేతికత లేదా పత్రాలు కావాలని షరతులు విధించకుండా సంక్షేమ హక్కులను సార్వజనీనంగా అందచేయాలని కోరింది.







కామెంట్‌లు (0)