• అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ప్రభంజనం
• కాంగ్రెస్ ఉభయ సభలూ కైవసం
వాషింగ్టన్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ప్రతినిధుల సభ (హౌస్), సెనేట్ రెండింటిపైనా పట్టు సాధించి రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. దీంతో ట్రంప్ పదవీకాలంలోని చివరి రెండేళ్లలో ఆయన అజెండాను అడ్డుకునే, పాలనపై వచ్చిన ఆరోపణలను విచారించే అధికారం డెమోక్రాట్లకు దక్కింది. ప్రతినిధుల సభ (హౌస్)లో మొత్తం 435 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీకి కావలసిన 218 మార్కును డెమోక్రాట్లు అందుకున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు 228 స్థానాలు గెలుచుకోగా, రిపబ్లికన్లు 139 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో హకీమ్ జెఫ్రీస్ తదుపరి హౌస్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే, సెనెట్‌లో మొత్తం 100 స్థానాలుండగా, మంగళవారం 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో డెమోక్రాట్లు 20 గెలుచుకున్నారు. అంతకుముందున్న వాటితో కలిపి సెనెట్‌లో డెమోక్రాట్ల బలం 54కు చేరింది. రిపబ్లికన్లు కేవలం 13 స్థానాల్లోనే విజయం సాధిం చారు. వీరి సభ్యుల సంఖ్య 44కు పడిపోయింది.
జీవన వ్యయాలు, సుంకాలు (టారిఫ్‌లు), ఇరాన్‌పై ట్రంప్ చేపట్టిన యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటడం వంటి అంశాలపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఫలితాల్లో ప్రతిబింబించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆమోదం రేటింగ్‌లు రికార్డు స్థాయి కనిష్ఠాలకు చేరువలో ఉన్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు ఆయన రెండో పదవీకాలంపై దేశవ్యాప్త తీర్పుగా నిలిచాయి. ‘‘అద్దె, నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుల విషయంలో నిజంగా ఏదైనా చేసే వారు కాంగ్రెస్‌లో ఉండాలని కోరుకుంటున్నా’’ అని లాస్ ఏంజెలెస్‌కు చెందిన 24 ఏళ్ల ఓటరు టేలర్ కుక్ ఎఎఫ్‌పి వార్తా సంస్థకు తెలిపారు.
సోషలిస్టుల చారిత్రక విజయాలు
ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులు అద్భుత ఫలితాలు సాధించారు. ‘డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా’ ( డిఎస్‌ఎ) మద్దతున్న అభ్యర్థులు పలు కీలక స్థానాల్లో గెలిచారు. హౌస్‌కు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఐదుగురు కొత్త డెమోక్రటిక్ సోషలిస్టు అభ్యర్థులు గెలిచారు. న్యూయార్క్ నుంచి క్లైర్ వాల్డెజ్, దరియాలిజా అవిలా చేవాలియర్, పెన్సిల్వేనియా నుంచి క్రిస్ రాబ్, మిచిగాన్ నుంచి డొనవాన్ మెక్కిన్నీ విజయం సాధించారు. కొలరాడోలో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ డెమోక్రాట్ నేతను ఓడించిన మెలాట్ కిరోస్ విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరు ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న అలెగ్జాండ్రియా ఒకేసియో-కోర్టెజ్, రషీదా త్లైబ్‌లతో కలిసి పనిచేయనున్నారు. అలాగే, మేయర్ స్థానాల్లోనూ డెమోక్రటిక్ సోషలిస్ట్‌లు విజయాలు నమోదు చేశారు. వాషింగ్టన్ డిసి మేయర్‌గా డెమోక్రటిక్ సోషలిస్టు జానీస్ లూయిస్ జార్జ్ గెలిచారు. న్యూయార్క్ మేయర్ మమ్దానీ తర్వాత అమెరికాలోని ఒక ప్రధాన నగర మేయర్ పీఠాన్ని దక్కించుకున్న సోషలిస్టు నేతగా ఆమె నిలిచారు. రోడ్ ఐలాండ్‌లోని ప్రావిడెన్స్ మేయర్‌గా డేవిడ్ మోరల్స్ విజయం సాధించారు. లాస్ ఏంజెలెస్ మేయర్ రేసులో ఉన్న సోషలిస్టు మద్దతుదారు నిత్యా రామన్ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. గృహనిర్మాణం, వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకోవడం వల్లే సోషలిస్టు అభ్యర్థులకు ఓటర్లు పెద్దపీట వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నేను బరిలో ఉంటే ఫలితం వేరుగా ఉండేది: ట్రంప్
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో మాత్రం భిన్నమైన స్వరం వినిపించారు. ‘‘నేను బరిలో లేను. ఉండి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం’’ అని పోస్ట్ చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను అన్నింటినీ వీటో చేస్తాను’’ అన్న ఆయన, చివరకు డెమోక్రాట్లతో ఒప్పందాలకు అవకాశం ఉందనీ అంగీకరించారు.
టెక్సాస్ కోట బద్దలు
టెక్సాస్ నగరంలో రిపబ్లికన్ల 38 ఏళ్ల చరిత్రను 37 ఏళ్ల యువకుడు జేమ్స్ తలారికో బద్దలు కొట్టారు. ట్రంప్ ముఖ్య అనుచరుడైన కెన్ పాక్స్‌టన్‌పై సెనేట్ స్థానాన్ని గెలుచుకుని జేమ్స్ సంచలన విజయం సాధించారు. 1988 నుండి ఇక్కడ రిపబ్లికన్లు గెలుస్తూ వచ్చారు. అంతటి కీలకమైన టెక్సాస్ నగరాన్ని వారు కోల్పోయారు. అలాగే, 1938 నుండి అంటే 94 ఏళ్ల నుండి గెలవని కన్సాస్ సెనెట్ స్థానాన్ని కూడా ట్రంప్ పార్టీ కోల్పోయింది. ఈ రాష్ట్రంలో అభ్యర్థి ఆడమ్ హామిల్టన్, రిపబ్లికన్ సీనియర్ సెనేటర్ రోజర్ మార్షల్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. అంతే కాకుండా, పిల్లల వైద్యురాలు ఆనీ ఆండ్రూస్ (డెమోక్రాట్), ట్రంప్ మద్దతున్న డార్లిన్ గ్రాహమ్‌ను సౌత్ కరోలినాలో ఓడించారు. జులైలో మరణించిన సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్థానంలో ఆయన సోదరి డార్లిన్‌ను నియమించారు. అత్యంత సంప్రదాయ రాష్ట్రమైన సౌత్ కరోలినాలో 1998 తర్వాత డెమోక్రాట్లు సెనేట్ ఎన్నికల్లో గెలవడం ఇదే మొదటిసారి. నార్త్ కరోలినాలో మాజీ గవర్నర్ రాయ్ కూపర్, ట్రంప్ ఎంపిక చేసిన అభ్యర్థిని ఓడించారు. జార్జియాలో పార్టీ ఉదయతార జాన్ ఆసాఫ్ తిరిగి ఎన్నికయ్యారు. న్యూ హాంప్‌షైర్లో క్రిస్ పపాస్ గెలిచి, సెనేట్‌కు ఎన్నికైన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఫ్లోరిడాలో ఆష్లీ మూడీ (రిపబ్లికన్) తన సెనేట్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మిచిగన్ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ సేనేట్ రేసులో విజయం సాధించారు. రిపబ్లికన్ నేత మైక్ రోజర్స్‌పై ఆయన గెలుపొందారు. దీంతో అమెరికా రాజకీయ చరిత్రలో సేనేటర్‌గా గెలిచిన తొలి ముస్లిం నేతగా అబ్దుల్ ఎల్ సయ్యద్ రికార్డు సృష్టించారు. అయితే, అబ్దుల్ ఎల్ సయ్యద్ భార్య డాక్టర్ సారా జుకాకుది కోస్టల్ కర్నాటక కావడం గమనార్హం.
హౌస్‌లోనూ డెమోక్రాట్ల హవా
సంప్రదాయంగా రిపబ్లికన్లకు పట్టున్న ప్రాంతాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు సాధించారు. ఇండియానాలో 2024లో ట్రంప్ 17 పాయింట్ల తేడాతో గెలిచిన జిల్లాలో డెమోక్రాట్ జె.డి. ఫోర్డ్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు విక్టోరియా స్పార్ట్జ్‌ను ఓడించారు. ఇది ‘‘బ్లూ వేవ్’’కు తొలి సంకేతమని విశ్లేషకులు ముందే అంచనా వేశారు. నార్త్ కరోలినాలోనూ ఒక రిపబ్లికన్ స్థానం డెమోక్రాట్ల పరమైంది. ఫ్లోరిడాలో పునర్విభజన వల్ల రిపబ్లికన్లు ఆశించిన లాభాలు దక్కలేదని ఫలితాలు సూచిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలు, ఆర్థిక పరిస్థితులపై అసంతృప్తి కారణంగా సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, ఒహాయో, ఐయోవా వంటి రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు సంచలన విజయాలు సాధించినట్లు నివేదికలు తెలిపాయి.
కొంప ముంచిన ఇరాన్ యుద్ధం..
ఇరాన్ పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విషయంల ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. మాపై యుద్ధాన్ని అమెరికా వాళ్లే ఛీ కొట్టారు అంటూ ఇరాన్ పేర్కొంది. అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారనే స్పష్టమైన సందేశం ఇచ్చారని ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ అన్నారు.
యుద్ధంతో అమెరికా ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిందని. ఈ అసంతృప్తి ఈ మధ్యంతర ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది అంటూ వెల్లడించారు మొహమ్మద్ బఘేర్. ధరల పెరుగుదలలో అయినా.. సొంత మనస్సాక్షితో అయినా.. యుద్ధం వద్దు అని అమెరికన్లు ఓటు ద్వారా చెప్పారని.. అమెరికా ప్రజల తీర్పును గౌరవిస్తు్న్నామని.. ఇప్పటికైనా ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలని కోరారు. అమెరికా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా.. మొండి వైఖరితో ట్రంప్ ముందుకు వెళితే.. అమెరికా చరిత్రలో అది ఒక పీడకలగా మారుతుందని.. రాబోయే రోజుల్లో అమెరికా ప్రజల జీవన వ్యయం ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. హౌస్‌లో మెజారిటీ రావడంతో ఇరాన్ యుద్ధం, వలసల బహిష్కరణలు, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ కమిటీలు విచారణ జరపగలవు. సెనేట్‌ను కూడా కోల్పోవడంతో ట్రంప్ న్యాయమూర్తుల నియామకాలు, ఉన్నత పాలనా నియామకాలకు ఆటంకాలు ఎదురుకానున్నాయి.







కామెంట్‌లు (0)