శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిజన్‌ ప్లాన్‌ అమలు చేయండి

10 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సమీక్షలో సిఎం ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నియోజకవర్గాల విజన్ ప్రణాళిక అమలు చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలు, పి-4 కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ ప్రణాళికే పనితీరుకు ప్రామాణికంగా ఉంటుందని స్వష్టం చేసారు. విజన్ ప్రణాళికపై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. నియోజక వర్గాల వారీ ప్రణాళిక అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని చెప్పారు. స్థానికంగా ఉండే వనరుల లభ్యతను ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యేలు ఎప్పటి కప్పుడు సమీక్షలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో సమీక్షలు మొక్కుబడిగా కాకుండా, ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండేలా నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారులకు కేవలం నగదు సాయం అందించడమే కాకుండా, వారిని ఆర్థికంగా నిలబెట్టి సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పేదరిక నిర్మూలనకు పారిశ్రామికవేత్తలను సైతం ప్రోత్సహిస్తూ, సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గాల్లోనూ తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అలాగే అనుమతులు పొందుతున్న పరిశ్రమలు ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో గ్రౌండ్ అయ్యే విధంగా ప్రజా ప్రతినిధులు, క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని చంద్రబాబు ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు సాంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ప్లాన్‌ను వర్తింపజేస్తూ సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాలని కోరారు. పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలు కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్‌, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఏపీఎస్డిపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్