శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు పెంచండి

17 గంటల క్రితం

p[rotes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

- ​అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలి

- విజయవాడ, నెల్లూరుల్లో ధర్నా

​ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు: నిరుద్యోగులను మోసగించడం తగదని, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం వెంటనే రీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని, ​కాకినాడలో నిరుద్యోగులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ నిరుద్యోగులు శుక్రవారం ఉద్యమించారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన నెల్లూరులోనూ, విజయవాడలోనూ ఆందోళనకు దిగారు. విజయవాడలో లెనిన్‌ ‌సెంటరులో ధర్నా చేశారు. నెల్లూరులో విఆర్‌సి గ్రౌండ్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విఆర్‌సి సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. అంబేద్కర్ బొమ్మ వద్ద మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతపై ఎమర్జెన్సీ తలపించే విధంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నిరుద్యోగులను భయబ్రాంతులకు గురి చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం తగదన్నారు. హోంమంత్రి అనిత అసెంబ్లీ సాక్షిగా పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు ఉన్నాయని, అందులో 11,639 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని తెలిపారని గుర్తుచేశారు. కానీ, కేవలం 2,050 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. గత రెండేళ్లుగా జాబ్ కేలండర్‌ లేక, నోటిఫికేషన్లు రాక వేలాది మంది అభ్యర్థుల వయస్సు పెరిగి అనర్హులవుతున్నారని తెలిపారు. వయోపరిమితి పెంచాలని డిమాండ్‌ ‌చేశారు. కాకినాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, నిరుద్యోగులు, స్టడీ సర్కిళ్ల వారిపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నాలో డివైఎఫ్ఐ ఎన్‌‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి శివ, నాయకులు నిజాముద్దీన్‌, నెల్లూరు ధర్నాలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, ఎం.వి. రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్