- వైభవంగా నగరోత్సవం
- నేడు తెప్పోత్సవం
- దుర్గమ్మను దర్శించుకోనున్న గవర్నర్
ప్రజాశక్తి- ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మను బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 94,811 మంది దర్శించుకున్నారు. భవానీ మాలధారుల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. యాత్రికులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం వైభవంగా సాగింది. కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. ఆలయ ఇఒ శీనా నాయక్, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. విజయదశమి నాడు మంగళవారం 10.30 గంటలకు నిర్వహించే మహా పూర్ణాహుతితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం దుర్గమ్మ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకోనున్నారు.
నేడు మెగా కార్నివాల్
శరన్నవరాత్రుల ముగింపులో భాగంగా మంగళవారం విజయవాడలో ‘మెగా కార్నివాల్’ జరగనుంది. ఏలూరు రోడ్డులోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుండి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్, విశాలాంధ్ర రోడ్డు మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు.







కామెంట్‌లు (0)