విశాఖ : నగర అభివృద్ధికి, కాలుష్య నియంత్రణకు, అవినీతిలేని పాలన అందించేందుకు వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ప్రజల వనరులను కార్పొరేట్లకు ధారాదత్తంచేసి, సామాన్య ప్రజలపై భారాలు వేస్తున్న కూటమి పార్టీలు టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్ధులను ఓడించాలని పిలుపునిచ్చాయి. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయం (ఏచూరి భవన్) లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా నాయకులు పైడిరాజు, సిపిఎం (ఎంఎల్) ప్రజా పోరు నాయకులు సిహెచ్ దేవా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ మిక్కిలి రవి భాస్కర రావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణారావు, ఎంసిపిఐ నాయకులు పట్నాయక్, జివిఎన్ రెడ్డితో కలిసి సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని హననంచేసి, కార్పొరేట్లకు సేవచేస్తున్న కూటమిని జివిఎంసి ఎన్నికల్లో ఓడించి ప్రజల పక్షాన నిజాయతీగా పనిచేస్తున్న వామపక్ష పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులను గెలిపించాలన్నారు. జివిఎంసిలో ప్రత్యామ్నాయ, జవాబుదారీతనంతో కూడిన పాలన, సేవలు ప్రజలకు అందించేందుకు సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, సిపిఐ ఎంఎల్ (ప్రజాపోరు), ఎస్. యు.సి.ఐ సి, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేయాలని చేసిన నిర్ణయానికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.
నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించకుండా, ప్రజలకు సరిపడా తాగునీరు సరఫరా చేయకుండా, డేటా సెంటర్లకు పచ్చని కొండలను కేటాయించి కాలుష్యం, నీటి సమస్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. ప్రపంచ వ్యాపితంగా డేటా సెంంటర్లను వ్యతిరేకిస్తుంటే, కూటమి ప్రభుత్వం డేటా సెంటర్లకు అనుమతులిచ్చి నగర ప్రజలను కష్టాలపాల్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా నియంత్రించే చర్యలు ప్రభుత్వం తీసుకోవడంలేదని విమర్శించారు. పురుషోత్తప్నటం లిఫ్ట్ ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరాను మెరుగుపర్చడంలో వామపక్షాలు చేసిన కృషిని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రయివేటీకరించవద్దని జివిఎంసిలో తీర్మానం చేయించడంలోనూ, ప్లాంట్ పరిరక్షణలో కమ్యూనిస్టు పార్టీల పాత్ర వుందన్నారు. నగరంలోని సింహాచలం దేవస్థానం కొండలతో సహా అనేక కొండలను డేటా సెంటర్లకు ప్రభుత్వం కేటాయించి నగరాన్ని విధ్వంసం చేస్తుందన్నారు. కూటమి, మోడీ ప్రభుత్వాలు విశాఖ నగర అభివృద్ధికి చేసినదేమీలేదన్నారు. దశాబ్దాల చరిత్రకల్గిన విశాఖ విమానాశ్రయాన్ని జిఎంఆర్ కోసం భోగాపురం తరలించి నగర ప్రజలకు సమస్యలను పెంచిందని, జివిఎంసి, విఎంఆర్డిఎ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించుకొని నగర అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. ప్రజా సమస్యలను జివిఎంసిలో లేవనెత్తి పరిష్కరించడంలో వామపక్ష కార్పొరేటర్లు గణనీయమైన పాత్ర గతంలో పోషించారని తెలిపారు. ప్రజానుకూల పాలన కోసం, ప్రజల తరపున జివిఎంసిలో మాట్లాడే వామపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీల కార్పొరేటర్ల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.








కామెంట్‌లు (0)