న్యూఢిల్లీ : డార్క్ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డుల ప్రాథమిక పరిశీలనలో వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్న 3,897 మంది ఖాతాదారుల రికార్డులను గుర్తించినట్లు ఎస్‌బిఐ వెల్లడించింది. అయితే, ఖాతాదారుల ఖాతాల్లోని నిల్వలు, నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఘటనపై అక్టోబర్ 21న ప్రకటన విడుదల చేసిన బ్యాంకు, ప్రభావిత ఖాతాదారులకు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు శుక్రవారం తెలిపింది. ఖాతాదారులు సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలని, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, ఈమెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
డార్క్ వెబ్‌లో బయటపడినట్లు అనుమానిస్తున్న సమాచారంలో ఖాతాదారుల పేర్లు, పుట్టిన తేదీలు, లింగం, నమోదిత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. వీటితోపాటు బ్యాంకు శాఖల వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సీఐఎఫ్) నంబర్లు, లీడ్ ఐడీలు, రుణాలు, లీడ్ రికార్డులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు సమాచారం.
అక్టోబర్ 16న తమ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) నుంచి అందిన సమాచారంతో ఈ ఘటన గురించి తెలిసిందని ఎస్‌బీఐ వెల్లడించింది. డేటా ప్రామాణికత, లీకేజీ మూలాలు, దాని పరిధి, ఖాతాదారులకు ఎదురయ్యే ప్రమాదాలను నిర్ధారించేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమని తెలిపింది. ఇందుకోసం సీఈఆర్‌టీ-ఇన్ గుర్తింపు పొందిన స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థ సహకారాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఘటన కారణంగా బ్యాంకు ప్రధాన కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, సేవల కొనసాగింపుపై గణనీయమైన ప్రభావం పడలేదని ఎస్‌బిఐ పేర్కొంది.







కామెంట్‌లు (0)