గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

1 గంట క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎన్టీఆర్ జిల్లా - ఇబ్రహీంపట్నం : జనహితం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. జర్నలిస్టుల అత్యవసర అవసరాల కోసం రూ.2.5 లక్షలు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఏఈ అసోసియేషన్ హాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ప్రతినిధులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న మంచి, చెడులను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రెస్ క్లబ్ ఏడాది కాలంగా జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రెస్ క్లబ్ మరింత అభివృద్ధి చెంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.

అత్యవసర నిధికి రూ.2.5 లక్షలు

జర్నలిస్టుల సంక్షేమం పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుతూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు జర్నలిస్టుల అత్యవసర నిధికి రూ.2.5 లక్షలు ప్రకటించారు. జర్నలిస్టులు ప్రమాదాల్లో గాయపడినప్పుడు, జర్నలిస్టు మిత్రుల కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి ద్వారా తక్షణ సహాయం అందించాలని సూచించారు. జర్నలిస్టు మిత్రులకు అన్ని సమయాల్లో అండగా ఉంటానని, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అత్యవసర నిధికి ఎమ్మెల్యే గారు నిధులు కేటాయించడం పట్ల ప్రజా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ వసంత కృష్ణప్రసాదు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్