శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు

20 ఆగస్టు, 2026

State Government Must Restore GO No. 3: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 12:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బిసి రిజర్వేషన్లకు మద్దతు

  • 50 శాతం పరిమితి ఎత్తివేస్తేనే అది సాకారం

  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్ పర్సన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికల పద్దతిని వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. దీనివల్ల ప్రజలకు దగ్గరగా వుండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలకు ప్రాధాన్యత లేకుండా దిష్టిబొమ్మలుగా మిగిలిపోతారని తెలిపారు. అధికారం కేంద్రీకృతమై పోతుందని, 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం బలహీనపడుతుం దని, అందువల్ల ప్రస్తుత విధానాన్నే కొనసాగిం చాలని కోరారు. వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు ఖాయం చేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఇది అమల్లోకి రావాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని సవరించాలని, మిశ్రా కమిషన్ సైతం దీన్ని ఎత్తిచూపిందని పేర్కొన్నారు. దీనికి పార్లమెంటు చట్టం చేయాలని కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపిలు ఈ రాజ్యాంగ సవరణ జరిగేటట్లు చూడాలని కోరారు. ఆ పని చేయకుండా ఇక్కడ ఒక తీర్మానం చేయగానే అది అమల్లోకి రాదని, న్యాయపరమైన ఆటంకాలు ఎదుర్కొంటుందని ప్రభుత్వానికి కూడా తెలుసని పేర్కొన్నారు. వైసిపి, టిడిపిలు దీని చుట్టూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఆరోపణలతో సరిపెట్టు కోకుండా రెండు పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు. తెలిసీ బిసిలను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల పేరుతో హడావుడిగా రిజర్వేషన్ తెచ్చి అమలు చేయక పోతే ప్రభుత్వ చిత్తశుద్దినే ప్రశ్నించాల్సి వస్తుందని తెలిపారు. 2026 జనగణనతోపాటు కులగణన కూడా జరుగుతోందని, ఇది పూర్తయితే సామాజిక పరమైన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఈలోగా మిశ్రా కమిషన్ సిఫార్సులన అనుసరించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ రాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని వివరించారు. అలా కాకుండా కేవలం ప్రచారం కోసం చేస్తే అది బిసిలకు అన్యాయం చేయడమే అవుతుందని సిపిఎం హెచ్చరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్