- పుష్కరం దాటినా.. నెరవేరని ‘నమామి గంగే’ లక్ష్యం
- గంగా నదీజలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పగా ప్రచారం చేసుకున్న ‘నమామి గంగే’ ప్రాజెక్టు పూర్తిగా విఫలమైంది. ఈ పేరిట రూ.42 వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించినా..అవన్నీ గంగపాలైయ్యాయే తప్ప ఇసుమంతైనా కాలుష్యం నుంచి గంగకు విముక్తి కలగలేదు. నదిని శుద్ధి చేసి స్వచ్ఛమైన జలాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2014లో 'నమామి గంగే' పథకం ప్రారంభించారు. ఇప్పటికి పుష్కరకాలం దాటినా..గంగా నది కాలుష్య కాసారంగానే కొనసాగుతోంది. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరుతూనే వున్నాయి. అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్, ఐఐటి ఖరగ్‌పూర్ నిపుణుల సహకారంతో నిర్వహించిన పరిశోధనాత్మక అధ్యయనంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 2,500 కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది పరిస్థితిని అంచనా వేసేందుకు నాసా, కోపర్నికస్ సంస్థలకు చెందిన పదేళ్ల శాటిలైట్ సమాచారాన్ని విశ్లేషించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. గత దశాబ్దంతో పోలిస్తే గంగానదిలోని చాలా ప్రాంతాల్లో నీటి నాణ్యత గణనీయంగా పడిపోయిందని ఈ పరిశోధనలో వెల్లడైంది. పారిశ్రామిక ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పుణ్యక్షేత్రాల సమీపంలో సేకరించిన నీటి నమూనాల్లో కాలుష్య కారకాలు అనుమతించిన పరిమితులను మించి ఉన్నట్లు తేలింది.
వర్షం పడితే మరింత ప్రమాదం !
గంగానది కాలుష్య సమస్యకు వర్షాకాలం మరో కోణాన్ని జోడిస్తోంది. వర్షాకాలం అనంతరం వచ్చే నెలల్లో నదిలోని దాదాపు 80 శాతం ప్రాంతాల్లో నీరు అధికంగా బురదమయంగా మారుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. వర్షాలతో నదిలోకి చేరుతున్న మట్టి, ఇతర వ్యర్థాలు నీటి నాణ్యతను మరింత దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా నదీజలాలు అనేక ప్రాంతాల్లో స్నానానికి కూడా అనువుగా లేని పరిస్థితులు నెలకొంటున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
సగం నిధులే ఖర్చు.. ఫలితాలేవి ?
గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో రూ.43,060 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ నిధుల్లో సగం మాత్రమే ఖర్చయినట్లు వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించినప్పటికీ నది కాలుష్యం మాత్రం అదుపులోకి రాకపోవడం ప్రాజెక్టు అమలు తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిధుల కేటాయింపులు, వాటి వినియోగం, చేపట్టిన పనుల పురోగతి, వాస్తవ ఫలితాలపై సమగ్ర సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగితాలపై కనిపించే ప్రగతికి, క్షేత్రస్థాయిలో నది పరిస్థితికి మధ్య అంతరం ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.
మురుగునీటిని అడ్డుకోలేకపోతున్న యంత్రాంగం ...
గంగానది కాలుష్యానికి ప్రధాన కారణం శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలే. పట్టణాలు, నగరాల్లోని ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిలో అధిక భాగం సరైన శుద్ధి లేకుండానే నదిలో కలుస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను నియంత్రించడంలోనూ అధికార యంత్రాంగం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని నివేదిక పేర్కొంది. మరోవైపు మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టిపిలు) పూర్తి సామర్థ్యంతో, నిరంతరాయంగా పనిచేయకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల మధ్య సమన్వయ లోపం, కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో నిర్లక్ష్యం కూడా నదీ ప్రక్షాళనకు అడ్డంకులుగా మారుతున్నాయి.
నదికే కాదు.. ప్రజల ఆరోగ్యానికీ ముప్పు ...
గంగానది కాలుష్యం కేవలం నదీజలాలకే పరిమితమయ్యే సమస్య కాదు. నదిలోని కలుషిత నీరు పరిసర ప్రాంతాల్లోని భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తే పంటల నాణ్యత, నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది. కలుషిత నీటితో ప్రజలకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని పరిశోధన హెచ్చరిస్తోంది.
ప్రక్షాళన ఎప్పుడు పూర్తవుతుంది ?
గంగానది ప్రక్షాళన అనేది కేవలం నిధుల కేటాయింపుతోనో, భారీ ప్రాజెక్టుల ప్రకటనలతోనో సాధ్యమయ్యే పని కాదు. నదిలోకి చేరే మురుగునీటిని పూర్తిస్థాయిలో అడ్డుకోవడం, పరిశ్రమల వ్యర్థాలపై కఠిన నియంత్రణ, శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరి. ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితాలను కూడా పారదర్శకంగా వెల్లడించాలి. పవిత్రతకు ప్రతీకగా భావించే గంగానదిని నిజంగా స్వచ్ఛంగా మార్చాలంటే ప్రచారానికి మించి కార్యాచరణ అవసరం. లేకపోతే వేల కోట్ల రూపాయల వ్యయం జరిగినా.. గంగానది కాలుష్య కాసారంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
కాలుష్యానికి ప్రధాన కారణాలివే ...
- పట్టణాలు, గ్రామాల నుంచి వెలువడే మురుగునీరు నదిలో కలవడం.
- పారిశ్రామిక వ్యర్థాలను పూర్తిస్థాయిలో నియంత్రించకపోవడం.
- మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిరంతరాయంగా పనిచేయకపోవడం.
- కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల మధ్య సమన్వయ లోపం.
- కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో బలహీనత.
- నదీ పరీవాహక ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, పట్టణీకరణ.







కామెంట్లు (0)