- ఫోర్ కొట్టి గెలిపించిన మోహిత్
- ఆసియా ఛాంపియన్స్ భారత్
- ఎసిసి అండర్-19 ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు
ఒమన్ గడ్డపై భారత యువ జట్టు సింహగర్జన చేసింది. చివరి ఓవర్, ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై టీమిండియా ఒక వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఓటమి అంచుల నుంచి అద్భుతంగా పుంజుకున్న మన కుర్రాళ్లు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కిరీటాన్ని ముద్దాడారు.
మస్కట్ : అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. ఓటమి ఖాయమనుకున్న దశలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. చివరి బంతికి 3 పరుగుల రావాల్సి వుండగా.. ఫోర్ కొట్టిన మోహిత్ ఉల్వా టీమిండియా హీరోగా నిలిచాడు. 338 పరుగుల భారీ ఛేదనలో భాగంగా తొలుత శుభారంభం దక్కినా.. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయి.. ఓటమికి చేరువైంది. జట్టు స్కోర్ 252 పరుగులకు చేరేసరికి 8 వికెట్లు కోల్పోయిన టీమిండియాను మనాల్ - మోహిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. ఆ దశలో మనాల్ ఔటైనా.. చివరి వికెట్‌కు చిగురుపాటితో కలిసి మోహిత్ అద్భుతంగా రాణించాడు. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సిన దశలో.. 5 బంతులు ముగిసేసరికి 5 పరుగులే చేశారు. దీంతో చివరి బంతిని ఫోర్ కొడితేనే టీమిండియా గెలుపు ఖాయం అనుకున్న దశలో పాక్ స్పిన్నర్ అహ్మద్ హుసేన్ వేసిన ఆ బంతిని మోహిత్ కవర్ డ్రైవ్‌లో ఫోర్ కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ మోహిత్‌కు, సిరీస్ ఆర్యవీర్ సెహ్వాగ్‌కు దక్కాయి. భారత అండర్ - 19 జట్టు చివరిసారిగా 2021లో యశ్ ధుల్ సారథ్యంలో టైటిల్‌ను సాధించింది.







కామెంట్‌లు (0)