గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేన, బిజెపి సిగ్గుతో తలదించుకోవాలి

32 నిమిషాల క్రితం

Government schools are empty... Where are the 5.56 lakh students? : YS Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:55 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- వైసిపి అధినేత 
జగన్‌‌మోహన్‌‌రెడ్డి

- డిఎస్‌‌సి స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నాయి

- సిబిఐ విచారణ కోరుతున్నాం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌‌సి కుంభకోణంలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జనసేన, బిజెపి సిగ్గుతో తలదించుకోవాలని వైసిపి అధినేత జగన్‌ అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్‌‌సిలో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పలు జిఓలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు చూపించి వాటిని మీడియాకు వివరించారు. అర్హత లేనివారికి స్పోర్ట్స్‌ ‌కోటా పేరుతో ఇష్టారాజ్యంగా పదవులు ఇచ్చారని అన్నారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏడు దశల్లో తనిఖీ చేశామని చెప్పారని, అసలు జరగని పోటీలు జరిగినట్లు చూపించి ఉద్యోగాలు పొందారని, దీనికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అసెంబ్లీలోనూ ఇదే అంశాలు చెప్పారని, అవన్నీ తప్పుడు వివరాలని అన్నారు. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తుంటే దానిలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భాగస్వాములు అవుతున్నారని అన్నారు. దీనిపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను దగా చేశారని అన్నారు. మెగా డిఎస్‌‌సి కుంభకోణాన్ని తవ్వేకొద్దీ, ఈ స్కాం తాలూకు రూపాలు చాలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా ఆధారాలు బయటపెడితే కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని, సోషల్‌ ‌మీడియా అకౌంట్లను బ్లాక్‌ ‌చేస్తున్నారని తెలిపారు. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీల్లా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. అయినా వాటిని కప్పి పుచ్చుకునే కుతంత్రంతో అధికారుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడు సార్లు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషనని చెప్పారని, అయినా యథేచ్ఛగా ఫేక్‌ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జరగని పోటీలు, టోర్నీలు చూపి సర్టిఫికెట్లు జారీ చేశారని, అవి బోగస్‌ సర్టిఫికెట్లని అసోసియేషన్లు వెల్లడించాయని తెలిపారు. అయినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా తమవారికి ఉద్యోగాలు ఇచ్చి తరువాత జిఓలు రద్దు చేశారని తెలిపారు. ఏ పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. కొత్త జీఓలు జారీ చేసి ఉద్యోగాలు ఇచ్చి వెంటనే జిఓలు రద్దు చేశారని తెలిపారు. అదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, డిఎస్‌‌సి స్కామ్‌ బయట పడడంతో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ స్థాయిలో అక్రమాలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థలు పతనమవుతాయని చెప్పారు. చంద్రబాబు స్కామ్‌ల చరిత్రలో ఇదొక ఆణిముత్యమని తెలిపారు. ఏ పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వడంతోపాటు , వాటి ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారని, చంద్రబాబునాయుడు తెలిపారు. జరగని పోటీలు జరిగినట్లు చూపించి ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో క్రీడా కోటాలో 372 మందిని నియమిస్తే, ఒక్క జూడో కేటగిరీలోనే మొత్తం 39 మందికి పరీక్ష లేకుండానే పోస్టింగ్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్‌బాల్‌ పేరిట 38 మంది ఉద్యోగాలు ఇచ్చారని, వారిలో 21 మందికి సర్టిఫికెట్లు ఆయన ఇచ్చినవేనని అన్నారు. టెట్‌ పాస్‌ అర్హత లేకపోయినా పోస్టులు ఇచ్చామని అధికారులు ఒప్పుకోక తప్పలేదని అన్నారు. కాక్రోచ్‌లు వస్తాయంటే ఊరికే రావని, వ్యవస్థలను దగ్గరుండి పాలకులు చెడగొడితేనే వస్తాయని పేర్కొన్నారు. తనలాండి వాడు కూడా కాక్రోచ్‌ అవుతాడని అన్నారు. ఎపిపిఎస్‌‌సిలో కూడా పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ పొందిన అటవీ శాఖ ఉద్యోగాలు 814లో స్పోర్ట్స్‌ కోటాలో 40 పోస్టులను, డిఎస్‌‌సి మాదిరిగా పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు, డిఎస్‌‌సి కోసం జారీ చేసిన జీఓ నెం 4 వాడుకున్నారని, స్కామ్‌ బయట పడడంతో, ఆ 40 పోస్టుల భర్తీ ఆపేయడమే కాకుండా, మిగిలిన పోస్టుల భర్తీ కూడా ఆపేశారని పేర్కొన్నారు. డిఎస్‌‌సి స్కామ్‌‌పై సిబిఐ విచారణ జరగాలని, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డిఎస్‌‌సిలో అన్యాయం అంటే లక్షల మంది కోచింగ్‌ తీసుకున్న వారికి అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. చంద్రబాబు తన మీద కేసులు తాను కొట్టేయించుకుంటూ డిఎస్‌‌సి కేస్‌ నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడని, స్కిల్‌ కేసులో తనకు క్లీన్‌చిట్‌ వచ్చిందని చంద్రబాబు చెప్పుకోవడం దౌర్భాగ్యమని జగన్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్