-విప్పర్లలో ఆయుధాల కలకలం
- టిడిపి మద్దతుదారుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, మరణాయుధాలు స్వాధీనం
- పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే ఇరు గ్రూపుల ఘర్షణ
- పలు జిల్లాల్లో వైసిపి మద్దతుదారులపై టిడిపి శ్రేణుల దాడులు
ప్రజాశక్తి- యంత్రాంగం : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలోనూ టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడులతో పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమపై టిడిపి వారు దాడి చేశారని, తమ నామినేషన్ పత్రాలను చింపివేశారని వైసిపి శ్రేణులు ఆరోపించాయి. మున్సిపల్, పరిషత్తు ఎన్నికల్లోనూ నామినేషన్ల సందర్భంగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే ఉద్రిక్తతకు దారి తీసింది. సర్పంచ్ అభ్యర్థులుగా ఆదివారం నామినేషన్లు దాఖలు విషయంలో టిడిపిలోని రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన ఓ గ్రూపును మరో గ్రూపు అడ్డుకోవడంతో వాగ్వాదం తలెత్తి తీవ్ర ఘర్షణకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు పక్షాలనూ చెదరగొట్టారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్‌పి రోహిత్ కుమార్ చౌదరి విప్పర్ల గ్రామానికి చేరుకొని పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటా విస్తృత తనిఖీలు చేపట్టారు. టిడిపి మద్దతుదారుల ఇళ్లలో భారీ సంఖ్యలో పెట్రోల్ బాంబులు, కర్రలు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన వైసిపి మద్దతుదారులను నరసరావుపేట మండలం ములకలూరు గ్రామంలో టిడిపి వారు అడ్డుకున్నారు. దీంతో, తమకు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వైసిపి మద్దతుదారులు రాస్తారోకోకు దిగింది. పోలీసులు రంగంలోకి దిగి వారితో ఆందోళన విరమింపజేశారు.
మంత్రి ఇలాఖాలో అరాచకం
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గమైన రాయచోటి మండలం శిబ్యాల సచివాలయం పరిధి నందిపల్లి, పెమ్మాడపల్లి పంచాయతీలకు వైసిపి అనుకూలురు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. వారికి, అదే సమయంలో అక్కడే ఉన్న టిడిపి అనుకూల అభ్యర్థుల మధ్య మాటామాటా పెరిగి కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఇరుగ్రూపులను చెదరగొట్టారు. నామినేషన్ దాఖలు చేయడానికి లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట సచివాయానికి వచ్చిన వైసిపి అనుకూల వార్డు మెంబర్ అభ్యర్థిని టిడిపి అనుకూల సర్పంచ్ అభ్యర్థి, మంత్రి అనుచరులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, సిఆర్‌పిఎఫ్ బలగాలు ఇరుగ్రూపులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తమను కట్టడి చేయడానికి బైండోవర్లు, అక్రమ అరెస్టులతో పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసిపి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
వైసిపి కార్యకర్తపై దాడి
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామంలో సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో పోటీ చేసేందుకు సిద్ధమైన వైసిపి కార్యకర్త శీనయ్యపై దాడి జరిగింది. శ్రీకాళహస్తి నుంచి కొంతమందిని స్థానిక టిడిపి నాయకులు ఆటోలో తీసుకొచ్చి తనపై దాడి చేయించారని, టిడిపికి వ్యతిరేకంగా సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు. దీనిపై పెళ్లకూరు పోలీసులకు శీనయ్య ఫిర్యాదు చేశారు. తొట్టంబేడు మండలం పొయ్య, తొట్టంబేడు, కొణతనేరి, సాంబయ్యపాలెం పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 22 నామినేషన్లు వచ్చాయి. తమ నామినేషన్ల పత్రాలను కూటమి నేతలు చించివేశారని వైసిపి మద్దతుదారులు ఆరోపించారు.










కామెంట్‌లు (0)