బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుమలలో పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఎస్వీ మ్యూజియం ప్రారంభం

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరుమల: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి కేంద్రాన్ని సందర్శించిన సీఎం.. వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శనాన్ని తిలకించారు. శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను యాత్రిలకు తెలియజేసేలా త్రీడీ వీడియో ప్రదర్శన కోసం ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం తిరుమల నారాయణగిరి సర్కిల్ వద్ద రిలయన్స్ ఫౌండేషన్, భారత్ బయోటెక్ సంస్థలు అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. యాత్రికుల సేవల కోసం రిలయన్స్ ఫౌండేషన్ 25 ఈవీ బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను అందించాయి. వీటితో పాటు ఛార్జింగ్ స్టేషన్లను కూడా టీటీడీకి అందించారు. రిలయన్స్ ఈవీ న్యూమొబిలిటీ సీఈఓ నితిన్ సేథ్, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా ఈ బస్సులను టీటీడీకి అందించారు.

ఈ ఏడాది జూన్‌లో తిరుమల పర్యటన సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీకి 25 ఈవీ బస్సులు అందిస్తామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రకటించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతో కలిసి సీఎం 32 ఈవీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ ఈవీ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు చంద్రబాబు ప్రయాణించారు. ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రిలయన్స్ ఈవీ మొబిలిటీ సీఈఓ నితిన్ సేథ్, సుచిత్రా ఎల్లా, టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులు ఉన్నారు.

తిరుమలలో ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి మ్యూజియంలోని విశేషాలను పరిశీలించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను యాత్రికులకు తెలియజేసేలా వివిధ అంశాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.

శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలను తెలిపే వస్తువులను ప్రదర్శించారు. శ్రీవారికి ధరింప చేసే వివిధ కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడళ్లలో చిత్రీకరించి ప్రదర్శనకు ఉంచారు. పానోరమిక్ స్క్రీన్‌పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను సీఎం తిలకించారు.

తిరుమల కొండపై ఉన్న వివిధ ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి, భౌగోళిక విశిష్టతలను తెలియజేసేలా మ్యూజియంలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. యాత్రికులకు అవగాహన కల్పించేలా తిరుమల ఏడు కొండల త్రీడీ మోడల్‌ను కూడా ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చి ఆయుధాలను త్యజించి ఆధ్యాత్మికతను అనుసరించిన వివిధ రాజ్యాల రాజుల ఆయుధాలను, అన్నమాచార్యులతో పాటు పలువురు యాత్రికులు శ్రీవారిని కీర్తించేందుకు ఉపయోగించిన సంగీత వాయిద్యాలను కూడా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్