- మంత్రి గొట్టిపాటి రవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం ఎపిఇపిడిసిఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంభవించిన తుపాన్ల సమయంలో ఎదురైన పరిస్థితులు, విద్యుత్ పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేలకూలినా, తీగలు తెగిపడినా వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలను ముందుగానే ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యానికి ఏమాత్రం తావులేదని, తుపాను సమయంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి: ఎపిసిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డి
ఆక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎపిసిపిడిసిఎల్ సిఎండి పి పుల్లారెడ్డి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నెల 17, 18 తేదీల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, వాలిన విద్యుత్ స్తంభాల సరిచేత, వదులుగా ఉన్న విద్యుత్ వైర్లను బిగించే పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని సోమవారం సూచించారు.ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కనీసం రెండు లోడ్ల 9.1 మీటర్ల విద్యుత్ స్తంభాలు, ఒక లోడ్ 8 మీటర్ల విద్యుత్ స్తంభాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సిబ్బందికి సెలవులు మంజూరు చేయొద్దని తెలిపారు.








కామెంట్‌లు (0)