- తగ్గుతున్న ఉత్పత్తి, ద్రవ్యోల్బణం, సంక్షోభాన్ని సమిష్టిగా ఎదుర్కొవాలి
- సమీక్షలతో ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటాం
- కలెక్టర్ల సదస్సు ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీవ్రస్థాయి ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో నమోదైన లోటు వర్షభావం కారణంగా ఉత్పత్తి తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వర్షాభావం వల్ల తాగునీరు, పశువులకు నీరు, దాణా వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెడదామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమిష్టిగా ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవాలని చెప్పారు. సంక్షోభం వచ్చినప్పుడే నాయకత్వ సమర్థతను బేరీజు వేసుకోగలమని, మార్పునకు నాయకత్వమే అత్యంత కీలకం అన్నారు. సమర్ధులైన వారిని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా ఉండాలి తెలిపారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి ఆగిపోకూడదని, ప్రగతి నిలిచిపోకూడదన్నారు. సమస్యలు పక్కన పెట్టి నిర్లక్ష్యం వహిస్తే అవి ఇంకా కఠినంగా మారతాయని చెప్పారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు, రాష్ట్రానికీ నష్టం జరక్కూడదని తెలిపారు.ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రతీ నిర్ణయంలో వేగం, మానవీయ కోణం ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరుల్ని ఉపయోగిస్తే విస్తృతంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.ప్రస్తుతం ధరల మేరకు గ్రోత్ రేట్ అంచనా 13.44 శాతంగా నమోదైందని అన్నారు. జిఎస్టిలో 18 శాతం మేర వృద్ధి నమోదైందని, జిఎస్‌డిపి అంచనాలు కూడా దేశ సగటుతో పోలిస్తే అధికంగా ఉందని చెప్పారు. ఆదాయం లేకపోతే సంక్షేమం ఇవ్వలేమని,డీప్ టెక్నాలజీతో కూడిన న్యూ గవర్నెన్స్‌లో లీడర్‌షిప్ కీలకమని తెలిపారు.సాగునీటి రంగంలో 36 ప్రాజెక్టు నిర్మాణానికి క్యాలెండర్ ఇచ్చామని, నిర్దేశిత గడువులోగా అవి పూర్తి కావాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు.రాయలసీమ రైజింగ్ ను ప్రజలు విశ్వసిస్తున్నారని, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి రెక్కలు వచ్చాయని తెలిపారు.వెలిగొండ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు అభివృద్ధికి మార్గం ఏర్పడిందన్నారు.పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే మార్గాలతో లాజిస్టిక్స్ హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సదస్సులో కొత్త ఆలోచనలు కొత్త పాలసీలకు శ్రీకారం చుట్టామని, భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా చర్చించామన్నారు. సమీక్షలన్నీ ఫలితాలివ్వాలు ఇవ్వాలని, చర్చలన్నీ సేవలు అందించేలా ఉండాలని తెలిపారు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా అంతిమంగా ప్రజలకు ఫలితాలు ఇవ్వాలని చెప్పారు. పిజిఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. 5 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలని, రాష్ట్రంలోని 1,529 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని తెలిపారు.
కూటమి నేతల సూచనలు పరిగణలోకి తీసుకోవాలి
ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమి పార్టీలకు చెందిన నేతలు వస్తే వారిని గౌరవించి వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్సు విధానంలోనే ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి పార్టీల నేతలందరూ సమానమే అని అన్నారు. డిఎస్సి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, దీనిపై 350 పిటిషన్లను వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయదని, భయపడి వెనక్కు వెళ్లదని, కొందరు చేసిన ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో దారుణాలకు పాల్పడిందని విమర్శించారు.
ఇంటిస్థలాలు ఇవ్వాలి
గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని సిఎం అన్నారు. 2027 మార్చి నాటికి 5.32 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పారు.అన్ని హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని తెలిపారు. మరో 55 వేల ఇళ్లను 2026 డిసెంబర్‌లోగా, మిగిలిన వాటిని 2027 మార్చిలోగా పూర్తి చేయాలని వెల్లడించారు.








కామెంట్‌లు (0)