- పోలీసుల థర్డ్ డిగ్రీతోనే మృతి
- మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేశారు
- లాకప్‌డెత్ కేసులో సిట్ నివేదిక
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ శుక్రవారం కీలక విషయాలు వెల్లడించింది. పోలీసుల దెబ్బలకే సాయికృష్ణ చనిపోయాడని స్పష్టం చేసింది. మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో బైక్‌పై తీసుకెళ్లి స్మశాన వాటికలో దహనం చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఎ-4 నిందితుడు గులివిందల సురేష్‌ను సిట్ శుక్రవారం విజయవాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచింది. సురేష్ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పలు అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం... ఈ ఏడాది మే ఆరున మార్కాపురంలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్‌కు తరలించి సిఐ నాగరాజుకు అప్పగించారు. మే ఏడున కృష్ణలంక సిఐ నాగరాజు (ఎ-1), హెడ్ కానిస్టేబుళ్లు అశోక్ కుమార్ (ఎ-2), నాని (ఎ-3) కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను కొట్టారు. అనంతరం రాణిగారితోటలోని ఓ పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి మళ్లీ హింసించడంతో మే 12న సాయికృష్ణ మరణించాడు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో ఆయన మృతదేహాన్ని హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని బైక్‌పై మధ్యలో ఉంచుకుని దుప్పటి కప్పి కృష్ణలంకలోని స్వర్గపురి స్మశానవాటికకు తీసుకెళ్లారు. సిఐ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ సురేష్ మరో వాహనంపై వారిని అనుసరించాడు. స్మశానవాటిక 16వ ప్లాట్‌ఫారంపై శవాన్ని ఉంచి పూర్తిగా బూడిదయ్యే వరకు తగలబెట్టి సాక్ష్యాలు నాశనం చేశారు. ఏమైనా ఆధారాలు మిగిలాయేమోనని మే 18న నిందితులంతా కలిసి మళ్లీ స్మశానవాటికకు వెళ్లి పరిశీలించారు.
డిజిటల్ సాక్ష్యాలు డిలీట్... సాయికృష్ణ కుటుంబానికి బెదిరింపులు...
పోలీస్ కస్టడీలో సాయికృష్ణను బట్టలు లేకుండా ఉంచి తీసిన రెండు ఫొటోలను సిఐ ఆదేశాల మేరకు మరో కానిస్టేబుల్ ఫోన్ నుండి సురేష్ డిలీట్ చేసి డిజిటల్ సాక్ష్యాలను తారుమారు చేశాడు. తన కుమారుడు సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి విజయలక్ష్మి హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకో వాలని, భారీగా డబ్బులు ఇస్తామని మే 31న మృతుడి మేనమామ ముళ్లపూడి నవరంగ్‌ను కలిసి సురేష్ రాజీ ప్రయత్నాలు చేశాడు. కేసు తీవ్రతరం కావడంతో అరెస్టుకు భయపడిన సురేష్... తనను ట్రాక్ చేయకుండా మొబైల్ ఫోన్‌ను కాలువలో పారేసి హైదరాబాద్, నాగపూర్ తదితర ప్రాంతాలకు పారిపోయాడు. మూడు నెలలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో గురువారం విజయవాడ సిట్ కార్యాలయంలో లొంగిపోయాడు. దీంతో, సిట్ అధికారులు శుక్రవారం సురేష్‌ను స్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ లభ్యమైన సాయికృష్ణ బూడిద, మానవ ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.








కామెంట్‌లు (0)