అమరావతి : ఎపి లో జడ్పీ ఛైర్పర్సన్, ఎంపిపి పరోక్ష ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 19వ తేదీన ఎంపిపి, నవంబర్ 20వ తేదీన జడ్పీ ఛైర్పర్సన్ పరోక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రత్యేక సమావేశం కోసం నవంబర్ 14 వ తేదీలోగా సభ్యులకు నోటీసుల జారీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల రోజున మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగనుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎన్నికల రోజున ఉదయం 10 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ‘చేతులెత్తడం’ పద్ధతి ద్వారానే ఎంపిపి, జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విప్ కు లోబడే సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తే సభ్యత్వం రద్దు చేయనున్నారు. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ నిబంధన వర్తించదు. అధ్యక్ష లేదా ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ఉపాధ్యక్ష లేదా వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగకపోతే.. ఆ వెంటనే జరిగే అధ్యక్ష, ఛైర్ పర్సన్ ఎన్నికల సమావేశం రద్దు అవుతుంది.
కోరం లేకపోయినా లేదా ఇతర కారణాలతో ఎన్నిక వాయిదా పడితే.. మరుసటి రోజు (సెలవు దినమైనా సరే) మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ నిర్వహిస్తారు. ఎన్నికల సమావేశానికి ఎంపి లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నారు. అయితే వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. పార్టీ విప్‌గా వ్యవహరించే వ్యక్తుల వివరాలను ఎన్నికకు ముందు రోజు ఉదయం 11 గంటలలోగా ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల పారదర్శకత కోసం వీడియో చిత్రీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజీకి అనుమతి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.







కామెంట్లు (0)