మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనసేనకు మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాజీనామా

21 నిమిషాల క్రితం

Former corporator Peethala Murthy Yadav resigns from Jana Sena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 01:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పార్టీలో అన్యాయం జరిగింది.. స్వతంత్రంగా పోటీ చేస్తే ఓడించేందుకు కుట్రలు చేశారు.


ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : జనసేన పార్టీకి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22వ వార్డు మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (పి.ఎల్.వి.ఎన్. మూర్తి) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మంగళవారం పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన తనకు పార్టీలో తగిన గుర్తింపు లభించలేదని, సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఉన్నప్పటికీ టికెట్ నిరాకరించి అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో పార్టీ నేతలే తన ఓటమికి కుట్రలు చేశారని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలో చోటుచేసుకున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా తాను అనేక పోరాటాలు చేశానని మూర్తి యాదవ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్యాలెస్ వ్యవహారంలో న్యాయపోరాటం చేశానని, విశాఖలోని సీబీసీఎన్సీ స్థలంలో మాజీ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ చేపట్టిన నిర్మాణాలను అడ్డుకుని సుమారు రూ.100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేశానని తెలిపారు. ఎండాడలో అనాథల కోసం కేటాయించిన హయగ్రీవ స్థలంలో విల్లాల నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయించానని తెలిపారు. భీమిలి బీచ్ రోడ్డులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాణిజ్య సముదాయంపై హైకోర్టులో న్యాయపోరాటం చేసి, ఆ నిర్మాణాలను తొలగించేలా చేశానని తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రీ హోల్డ్ భూముల వ్యవహారం, ఐటీ హిల్స్ సమీపంలోని ఎన్‌సీసీ భూములు, వందల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్ల వ్యవహారం, వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజా ఆస్తుల పరిరక్షణకు కృషి చేశానని వివరించారు. జనసేన పార్టీ కోసం తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు వెళ్లిన సమయంలో నమోదైన కేసుల్లో పది రోజుల పాటు జైలు జీవితం గడిపానని మూర్తి యాదవ్ తెలిపారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన ఇతరులకు పదవులు దక్కగా, తనకు మాత్రం సిట్టింగ్ కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌గా 22వ వార్డులో సుమారు రూ.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టానని, తన గౌరవ వేతనాన్ని అన్న క్యాంటీన్లు, గ్రంథాలయాలకు విరాళంగా అందించానని పేర్కొన్నారు. వార్డులో ఆరు వేల మంది జనసేన సభ్యత్వాలు చేయించినట్లు గుర్తు చేశారు. టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా కప్పు-సాసర్ గుర్తుపై పోటీ చేశానని, ఆ సమయంలో జనసేన నేతలు తన ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మేయర్ అభ్యర్థికి కూడా ఉద్దేశపూర్వకంగా కప్పు-సాసర్ గుర్తు కేటాయించడం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారని, ఆ అభ్యర్థికి 690 ఓట్లు వెళ్లడంతో తాను కేవలం 62 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. పోలింగ్ రోజున దాడులు, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీకి దూరమైనప్పటికీ ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇకపై మరింత స్వేచ్ఛగా న్యాయపోరాటాలు కొనసాగిస్తానని మూర్తి యాదవ్ వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్