సిడ్నీ : యాక్సెంచర్‌తో ఆఫ్‌షోరింగ్ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన జాతీయ విమానయాన సంస్థ క్వాటాస్ 850 ఉద్యోగులపై కోత విధించనుంది. విమానయాన రంగంలో ఎఐ వినియోగాన్ని పెంచేందుకు వీలుగా, 850 ఉద్యోగాలను తొలగించి, కొన్ని కార్పోరేట్ విధులను కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌కు అవుట్‌సోర్స్ కింద అప్పగించనున్నట్లు క్వాంటాస్ మంగళవారం తెలిపింది. భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉంటుందని, మొదటి విడత కోతలు 2027 మధ్యకాలం నాటికి ఉండవచ్చని సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో క్వాంటాస్ సిఇఒ వనెసా హడ్సన్ పేర్కొన్నారు. ఇది కొందరికి కష్టతరమైన వార్త అని తెలుసునని, దీంతో ఏర్పడిన అనిశ్చితికి తాను చింతిస్తున్నానని అన్నారు. ఈ ఉద్యోగాల కోతతో క్వాంటాస్‌లో ఉన్న మొత్తం 28,000మంది ఉద్యోగుల్లో సుమారు 3శాతం మందిపై ప్రభావం చూపనుంది. కోతల మొదటి దశ ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ సిబ్బందిపై ప్రభావం చూపుతుంది. కొన్ని పదవులను యాక్సెంచర్‌కు బదిలీ చేసి, ప్రధానంగా భారత్‌లో ఉండే బృందాలచే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎఐ కారణంగా పరిశ్రమలో వస్తున్న వేగవంతమైన మార్పులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. తమ పాత సిస్టమ్‌లను సమూలంగా మార్చడానికి, కొన్ని కార్పొరేట్ విధులను సరళీకృతం చేయడానికి యాక్సెంచర్‌తో భాగస్వామ్యం సహాయపడుతుందని పేర్కొంది.
ఈ చర్యపై ఆస్ట్రేలియన్ సర్వీసెస్ యూనియన్ (ఎఎస్‌యు) ఆగ్రహం వ్యక్తం చేసింది. యాక్సెంచర్ ఒప్పందం కింద ఉద్యోగాలను విదేశాలకు తరలించే ప్రణాళిక ఏదీ లేదని క్వాంటాస్ ఈ ఏడాది ప్రారంభంలో హామీ ఇచ్చిందని, కానీ నేడు వందలాది మంది సిబ్బందిని తొలగించారని ఎఎస్‌యు సహాయ కార్యదర్శి స్కాట్ కోవెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాంటాస్ నుండి వివరణ కోరే హక్కు ఉందని అన్నారు . దేశవ్యాప్తంగా ఎఐ ప్రభావాన్ని చూపుతోందని కానీ, సాంకేతిక మార్పుల భారాన్నీ కార్మి కులపై మోపకూడదని అన్నారు.
ఖర్చులను తగ్గించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోపణలతో తమ ఉద్యోగులను విదేశాలకు తరలిస్తున్న ఆస్ట్రేలియన్ కంపెనీల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వూల్వర్త్స్, ఆఫీస్‌వర్క్స్, టెల్స్ట్రా మరియు నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ ఈ ఏడాది ఇటువంటి చర్యలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా క్వాంటాస్ చేరింది.







కామెంట్‌లు (0)